కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడీ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర చివరి మజిలీగా శ్రీనగర్‌లో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు రాహుల్. సోనావార్‌లో 30 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారని, అక్కడ నుంచి ఘంటా ఘర్ గా అత్యంత ప్రాచుర్యం ఉన్న క్లాక్ టవర్ వద్దకు చేరుకుని జాతీయ జెండా ఎగురవేసినట్లు పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో రాహుల్ వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పది నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరిగింది. భద్రతా కారణాల కారణంగా లాల్‌చౌక్‌కు వెళ్ళే అన్ని రోడ్లను మూసివేశారు.
భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా 75 జిల్లాల మీదుగా 4,080 కి.మీ. మేర కొనసాగింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగింది. చివరగా జమ్మూ కాశ్మీరులో సాగింది. శ్రీనగర్‌లోని బౌలెవార్డ్ ప్రాంతంలోని నెహ్రూ పార్క్ వద్దకు యాత్ర చేరుకోగానే యాత్ర ముగుస్తుందని చెప్పారు. రాహుల్ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో కొనసాగింది.