దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను క్రమంగా అదుపులోకి తీసుకుంటూ మరికొంత మందిని అరెస్టు చేస్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 8న) ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కాసేపటికే గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన బ్రింకక్ కో సేల్స్ కంపెనీకి ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. ఇతనికి ఆప్ నేతలకుపాటు పలవురికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారి ప్రమేయంతో లిక్కర్ స్కాం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక తాజాగా ఈడీ అధికారులు చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి(rajesh joshi)ని అరెస్టు చేశారు. గత రెండు రోజుల్లో ముగ్గురు వ్యక్తులు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. సౌత్ గ్రూపునకు 31 కోట్ల రూపాయలు రాజేష్ జోషి బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ నగదు మొత్తం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అధికారులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారుల పేర్లను ఈడీ(ED) చేర్చింది. మొత్తం 17 మందిపై అభియోగాలు నమోదు చేసిన ఈడీ…ఇటీవల రూపొందించిన చార్జీషీటులో డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) పేరును కూడా చేర్చింది. అతనితోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, శరత్ చంద్రా, విజయ్ నాయర్ సహా 17 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపొందించే క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ కు విజయ్ నాయర్ అత్యంత సన్నిహితుడిగా ఈడీ చార్జీషీటులో పేర్కొంది. మరోవైపు 428 పేజీల రెండో చార్జీషీటును కూడా ఈడీ రిలీజ్ చేసింది. రెండో చార్జీషీట్లోనే కవిత పేరును ప్రస్తావించారు.