ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేశంతో ఉగిపోలేదు… ఎక్కడా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు తీయలేదు…! కానీ సూటిగా మాత్రం వారికి చెప్పాల్సింది చెప్పేశారు… కేటీఆర్ పేరు ఓసారి తీసినప్పటికీ… ఆయనతో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కారణంగానే ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీలో కొనసాగినట్లు చెప్పారు. అధికార మదం, అధికార గర్వం, ఆవేదన చెందితే టార్గెట్ చేస్తారా, పదవి ఇవ్వకుంటే గౌరవమైనా ఇవ్వాల్సింది కదా.. అంటూ సూటిగా ప్రశ్నించారు. మీ అధికార దాహానికి, అధికార మదానికి ప్రజలు తీర్పు ఇచ్చే రోజు మరెంతో దూరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో పార్టీ మార్పుపై ఏ సంకేతాలు ఇవ్వనప్పటికీ, తాను మారుతానని, మారబోవడం లేదని సస్పెన్స్‌లో ఉంచే ప్రయత్నం చేశారు. కానీ అధిష్టానాన్ని ఇంతలా టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత ఆయన ఉంటారని ఎవరూ భావించరు. పార్టీ మారుతాననే నిర్ణయానికి వచ్చి ఉంటారని, అలాగే, ఏ పార్టీలోకి వెళ్లాలో కూడా ఇప్పటికే తేలిపోయి ఉంటుందని అంటున్నారు.
పొంగులేటి కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేశాయి. పది రోజుల క్రితం మాట్లాడిన ఒకటి రెండు మాటలకే అధిష్టానం ఇంతలా ఆగ్రహిస్తే, ఇప్పుడు ఇంత ఘాటైన విమర్శలు చేస్తే, తనకు టిక్కెట్ మాట అటు ఉంచి, టార్గెట్ చేస్తుందనే విషయం కూడా తెలుసు. అందుకే ఇరు పార్టీలతో చర్చించి, ఓ స్పష్టత వచ్చాక ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ పైన విరుచుకుపడి ఉంటారని అంటున్నారు. పొంగులేటి పార్టీ మారుతారనే వార్తలు వచ్చాక కేటీఆర్ కూడా రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ కేటీఆర్ రాయబారం ఫెయిల్ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన కోసం బీజేపీ ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ నుండి మల్లు భట్టి ప్రయత్నాలు చేయగా, బీఆర్ఎస్లోనే కొనసాగించేందుకు కేటీఆర్ అంతర్గతంగా ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ మారడం పక్కాగా కనిపిస్తోంది. కానీ ఏ పార్టీలోకి వెళ్తారనే అంశం తేలాల్సి ఉంది. ఈ సస్పెన్స్‌కు కూడా త్వరలో ముగింపు పలకవచ్చు.
తాను ఈ నాలుగేళ్లుగా ఎంత ఓపిక పట్టింది స్పష్టంగా చెప్పారు. అలాగే, తాను బీఆర్ఎస్ పెట్టిన బిక్ష ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేయలేదని చెప్పకనే చెప్పారు. వైసీపీ ద్వారా తొమ్మిదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చానని, 2014లోనే గెలిచానని, అప్పటికే బీఆర్ఎస్లో చేరిన తనకు తర్వాత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోయినా కేటీఆర్‌తో బంధం, కేసీఆర్ పైన గౌరవం కారణంగా పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత కూడా వివిధ సందర్భాల్లో పలువురికి పదవులు ఇచ్చినప్పటికీ, తనకు రాలేదని, అయినా తాను ఆవేదనను మనసులోనే పెట్టుకొని, పార్టీలో కొనసాగినట్లు చెప్పారు. పదవి ఇవ్వకున్నా గౌరవం లేకపోవడం, మనిషిని మనిషిలా చూడకపోవడం సరికాదని చెప్పారు.
గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోయినా ఓపికగా ఉన్నారు. నాలుగేళ్లుగా పదవులు ఇవ్వకపోయినా ఓపికతోనే ముందుకు సాగారు. సెక్యూరిటీని తగ్గించినా అదే ఓపిక వహించారు. ఈ రోజు మాటలు కూడా ఓపికగానే చెప్పారు. కానీ ఆ మాటలు మాత్రం పదునెక్కాయి. అధిష్టానానికి ఓ రకంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కడా కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో లేదు. అంతేకాదు, కనీసం బీఆర్ఎస్ జెండాలు కూడా కనిపించలేదు. అధిష్టానికి హెచ్చరికలు చూస్తేనే ఆయన పార్టీ మారటం పక్కా అని తేలిపోయింది. కానీ ఏ పార్టీ అనేది తేలాల్సి ఉంది. బీజేపీ వైపు అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రశాంతంగానే అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసిన పొంగులేటి.. ప్లాన్డ్‌గానే ఎదురు తిరిగినట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనపై అధిష్టానం చర్యలు తీసుకునేలా ఆయన నేటి వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకొని పార్టీ పెద్దలు కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
అసలు ఆయన పార్టీ మారాలని ఎప్పుడో నిర్ణయించుకున్నందునే పది రోజుల క్రితం ఒకింత విమర్శ చేశారని, ఇది తెలిసి అధిష్టానం సెక్యూరిటీని తగ్గించిందని, దీనిని ఆయుధంగా ఉపయోగించుకొని ఆయన తన విమర్శలకు పదును పెట్టారని, ఇప్పుడు చర్యలు ఖాయమని అంటున్నారు. ఆ తర్వాతే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారో తేలిపోతుందని అంటున్నారు.