పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత రావడం లేదు. తొలుత బీజేపీలో చేరతారని వినిపించింది. తర్వాత వైఎస్ఆర్ టీపీ అని ప్రచారం జరిగింది. తర్వాత ఆ పార్టీ అధినేత షర్మిలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన చేరిక ఖాయం అనిపించింది. దానిని షర్మిల కూడా ధృవీకరించారు. ఇంతలోనే పొంగులేటి మాట మార్చారు. తూచ్.. అనేశారు. అవును షర్మిల పార్టీలో చేరుతున్నారనే కామెంట్స్‌ను ఖండించారు. ఈ నెల 6వ తేదీన జరిగే ఆత్మీయ సమ్మేళనంలో అన్ని విషయాలు చెబుతానని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి గందరగోళం సృష్టించొద్దని షర్మిలపై మండిపడ్డారు.
పార్టీలో చేరతారు?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తమ పార్టీలో చేరతారని షర్మిల అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. పార్టీలో చేరతానని మాటిచ్చారని తెలిపారు. కొద్దిరోజుల క్రితం షర్మిలతో పొంగులేటి సమావేశమైన సంగతి తెలిసిందే. అంతకుముందు వైసీపీ తెలంగాణ అధ్యక్షుడిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పనిచేశారు. దీంతో షర్మిల పార్టీలో చేరిక లాంఛనమేనని అంతా అనుకున్నారు. ఇంతలో పొంగులేటి స్పందించారు. తన చేరిక గురించి మాట్లాడొద్దని గట్టిగానే చెప్పారు.
పొంగులేటి డుమ్మా
ఖమ్మంలో జరిగిన ఆవిర్భావ సభకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకాలేదు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పడటం లేదని పుకార్లు వినిపించాయి. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఎంతోమంది అడిగిన వినలేదని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఉన్నా.. తనకు పదవీ మాత్రం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోయానని వాపోయారు.
సందిగ్ధం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత వైసీపీలో చేరి, తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా పొంగులేటి పనిచేశారు. 2014లో వైసీపీ నుంచి ఖమ్మం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అటు నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. అయినప్పటికీ పదవీ ఇవ్వలేదు. దీంతో తిరిగి వైఎస్ఆర్ టీపీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఇంతలో షర్మిల కామెంట్లను ఖండించారు. మరి ఆయన ఏ పార్టీలో చేరతారో చూడాలి.