ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
KNR: శంకరపట్నం మండలం ఎరడపల్లిలో సర్పంచ్ కొయ్యడ రజిత, గ్రామ స్వరాజ్ సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ పుల్ల సుజాత ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ఒక్క మహిళా కుట్టు మిషన్ శిక్షణను పూర్తి స్థాయిలో నేర్చుకుని స్వంతంగా ఉపాధి పొందుతూ కుటుంబంలో సమాజంలో మంచి వ్యాపారులుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
KDP: చాపాడు మండలం అల్లాడుపల్లె రోడ్డు వద్ద సోమవారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు వైపు నుంచి కారు ప్రొద్దుటూరుకు వస్తుండగా బైకును తప్పించబోయి ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వైపునకు వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AP: జైళ్లు, సంస్కరణల బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖైదీల సంస్కరణలకు చర్యలు ప్రారంభమైనట్లు హోంమంత్రి అనిత అన్నారు. మహిళా ఖైదీల పిల్లలకోసం జైలులో అంగన్‌వాడీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. ఖైదీల పరివర్తనల్లో మార్పు తెచ్చేలా ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
BHPL: జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026 సంవత్సర డైరీ &క్యాలెండర్‌ను కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం కలెక్టర్ చాంబర్‌లో ఆవిష్కరించారు. సంఘం సభ్యులు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. TGOలు రూపొందించిన ఈ డైరీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ముఖ్య GOలు, అధికారుల సంప్రదింపు వివరాలు సమగ్రంగా ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు.
CTR: తవణంపల్లి మండలం నలిచెట్టిపల్లె పంచాయతీకి చెందిన 19 గ్రామాల ప్రజలు పూర్తి స్థాయి బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ప్రస్తుతం పాఠశాల సమయాల్లో మాత్రమే బస్సులు నడుస్తుండటంతో ఇతర సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే పశు వైద్యాధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.
ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా భారత రాజ్యాంగ పీఠిక ప్రతిని అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం ప్రతి సమస్యను ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
BDK: భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్ జన్మదినం సందర్భంగా ఇవాళ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్ష్మీపురం ప్రాంతంలో ఆర్గానిక్ పంటలను సాగుచేస్తూ ఆదర్శ రైతుగా నిలిచిన లక్ష్మీ రెడ్డి పంట యొక్క ప్రాముఖ్యతను ఆయనకు వివరించగా త్వరలోనే పంటలను వీక్షిస్తానని హామీ ఇచ్చారు.
అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గిరిజన సమస్యలను ప్రస్తావించారు. అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారానే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో 544 ఖాళీల భర్తీ, జీవో నెం.3 పునరుద్ధరణ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
TG: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన-2027ను చేపట్టేందుకు మంత్రివర్గం చర్చించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే గణన.. రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు సహా మొత్తం 89వేల మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాల్గొంటారు.
SRPT పట్టణంలోని టౌన్ హాల్‌లో ఈనెల 25న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నారు. సీఐ చరమందరాజు తెలిపారు. సర్కిల్ పరిధిలోని లారీ, ఆటో, స్కూల్ బస్, క్యాబ్ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ కే. నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు.
KMM: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి, మొత్తం 39 పతకాలు సాధించడం అభినందనీయమని సీపీ సునీల్ దత్ పేర్కొన్నారు. ఇందులో 15 బంగారు, 8 వెండి, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. క్రీడల పట్ల ఆసక్తిని కనబరుస్తూ కమిషనరేట్ పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన క్రీడాకారులను ఆయన అభినందించారు.
భీమునిపట్నం (భీమిలి) జీవీఎంసీ జోన్-1 కమిషనర్‌గా మేకల విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి, పారిశుధ్య నిర్వహణకు, పౌర సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది, స్థానిక నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
VZM: ప్రైవేటు విద్యను వ్యతిరేకిద్దాం, ప్రభుత్వ విద్యను కాపాడుకుందామని RSU జాతీయ అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లాలో గాంధీ సర్కిల్ నుంచి ఏపీ ఎన్జీవో హోం వరకు విద్యార్థులు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న అధ్యాపక, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.