KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు రషిదుల్లా బృందం మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా ఎన్నికైన సందర్భంగా రషీదుల్లా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సబ్ కోర్టు భవన నిర్మాణానికి నిధుల అనుమతి,గోనెగండ్లను ఎమ్మిగనూరు కోర్టు పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె స్వయంగా అర్జీలు స్వీకరించారు. సాగునీరు, మౌలిక వసతులు, ఇతర వ్యక్తిగత సమస్యలపై విన్నపాలు అందాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.
కోనసీమ: క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్య భారత్ సాకారమవుతుందని, కరాటే నేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు, ఆత్మ రక్షణ కూడా సాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం RCM చర్చ్‌లో ఆదివారం జరిగిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ -2026 పోటీలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు.
కృష్ణా: పామర్రు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కీలక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం హాస్పిటల్ సహకారంతో రేపు నిమ్మకూరు గ్రామంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించనున్నారు. నియోజకవర్గ మహిళలు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NRML: ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో నిర్మల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. రిథమిక్ యోగ అండర్-14 సబ్ జూనియర్ బాలుర విభాగంలో మాగం చరణ్ వెండి పతకం సాధించగా, అండర్-25 విభాగంలో దిలీప్ బంగారు పతకం అందుకున్నారు. జిల్లాకు మరిన్ని విజయాలు సాధించిన క్రీడాకారులను అధికారులు అభినందించారు.
GNTR: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్డీవోలు గ్రామ స్థాయి రికార్డులతో హాజరై ప్రజల అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు.
PLD: ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాళ్ల సందర్భంగా ఆదివారం స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలను భక్తులు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పొంగళ్లు పొంగించి స్వామికి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
NTR: అంతర్జాతీయ మాతృభాషా వారోత్సవాల ముగింపు సందర్బంగా తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సీనియర్ ఆంగ్ల ఉపాధ్యాయురాలు జయశ్రీని ఎల్టా కన్వీనర్ యం. రాం ప్రదీప్ పాఠశాలలో ఆదివారం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయ సిబ్బంది కె. లావణ్య, ఎన్.గీత, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం స్థానిక దాత ఎనిమిరెడ్డి బాలకోటయ్య రూ.1,00,000లను అందించారు. ఈ చెక్కును ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డికి సమర్పించారు. కనిగిరి మండలం రాగిమనిపల్లికి చెందిన బాలకోటయ్య సేవా భావాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, ఆసుపత్రి అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తామని తెలిపారు.
AP: ప్రస్తుతం భారత్‌లో 40 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉన్నారని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సిందియా తెలిపారు. ఈ సంఖ్య త్వరలోనే వందకోట్లకు చేరుతుందన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికీ భారత్ నెట్ చేరాలని ఆకాంక్షించారు. మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని చెప్పారు. భారత్ నెట్ కింద దేశవ్యాప్తంగా 800 టవర్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.
కృష్ణా: మచిలీపట్నం NH-216 పై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, డీఎస్పీ రాజా పర్యవేక్షణలో ట్రాఫిక్ సీఐ రాజు ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై వాహనదారులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని అధికారులు కోరారు.
SRPT: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన దొంతగాని శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన ఏడుగురు గౌడ కౌన్సిలర్లను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణంలోని శ్రీ కంఠమహేశ్వరి సూరమాంబ దేవస్థానం సన్నిధిలో కార్యక్రమం నిర్వహించారు. జై గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు.
బాపట్ల: తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలోని ఉయ్యాలవాడ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
SKLM: ఆమదాలవలసలోని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కేంద్రం సమీపంలో 144 సెక్షన్ అమలు చేసినట్లు స్థానిక ఎస్సై బాలరాజు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నివారించేందుకు ఈనెల 23 నుండి మార్చి 18 వరకు ప్రతిరోజూ ఉ. 8 గంటల నుంచి మ. 1 గంట వరకు జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని పేర్కొన్నారు.
సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద ఆదివారం సత్యన్న సేన సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్ఫూర్తితో ఐదుగురు గర్భిణీలకు ఆరు రకాల పౌష్టికాహారాన్ని అందజేశారు. నిరుపేద గర్భిణీలకు ప్రసవం వరకు ప్రతి నెలా ఈ పోషక ఆహారం పంపిణీ చేస్తామని సభ్యులు తెలిపారు. కరోనా కాలం నుంచి ఈ సేవ చేస్తున్నామని తెలిపారు.