TG: హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని క్రేయాన్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే 6 నెలల శిశువు మృతి చెందాడు. అయితే ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే.. బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశారు.
VZM: చీపురుపల్లి పట్టణంలోని పిల్లపేటలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వైసీపీ గ్రామ, అనుబంధ కమిటీల నియామకంపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కమిటీలు అత్యంత కీలకమని, వార్డుల వారీగా బాధ్యతగా పనిచేసి కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కష్టపడిన వారికి కమిటీల్లో చోటు కల్పించాలన్నారు.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కల్ట్’. ఈ మూవీ టీజర్‌ను ఈరోజు ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు రవి బస్రూర్‌కు విశ్వక్ సేన్ ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రవి బస్రూర్ అందించిన అద్భుతమైన సంగీతానికి కృతజ్ఞతగా ఈ స్పెషల్ గిఫ్ట్ అందించినట్లు విశ్వక్ తెలిపాడు.
HYD: శామీర్‌పేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై దాడి ఘటన నేపథ్యంలో పరామర్శించేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండించిన ఈటల ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.
WNP: ఖిల్లా ఘనపూర్ మండలంలోని గ్రామాల ఇంటర్ సెకండియర్ Mpc, Bipc చదువుతున్న విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం సాయం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు. ఖిల్లా సేవా సమితి ద్వారా దాతలు రేపు ఉ.9:30 గంటలకు బాలుర హైస్కూల్లో పరీక్ష రాసి పాసైన విద్యార్థులకు నెలకు రూ.12,500 స్కాలర్‌షిప్‌తో పాటు ఉచిత హాస్టల్ 3 ఏళ్లు సౌకర్యం కల్పించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
RR: నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని గ్రామంలో ఉన్న మసీదుకు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం రూ. 30 వేల నగదును మజీద్ నిర్వాహకులకు అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా సేవలో భాగంగా తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజాసేవలో భాగంగా సేవ గుణాన్ని చూపిన మాణిక్యంను నిర్వాహకులు ప్రశంసించారు.
NZB: డిచ్‌పల్లిలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సేవాలాల్ విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ చేశారు.
VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేటు స్థానిక వాహనదారులకు తీరని సమస్యగా మారింది. ప్రతిరోజూ రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో గేటు పడటంతో 15 నుంచి 20 నిమిషాలు నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ రూట్లో నిత్యం ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు వెళ్తుంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో స్థానిక వాహనదారులు సతమతమవుతున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని MLA పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శనివారం సత్యసాయి జిల్లా ఎన్జీవో సంఘం నాయకులు ఎమ్మెల్యేను, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్జీవో భవన నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు. CM దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ATP: రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆమె స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి ఆసుపత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీపురుపట్టి పరిసరాలు శుభ్రం చేశారు.
E.G: దేవరపల్లి మండల వైసీపీ ఉపాధ్యక్షుడిగా దేవరపల్లి గ్రామానికి చెందిన దుర్గారావు నేడు నియమితులయ్యారు. వైసీపీ పార్టీలో మొదటి నుంచి కష్టపడే నాయకుడిగా పేరు ఉన్న దుర్గారావుకు ఈ పదవి దక్కడం పట్ల దేవరపల్లి పట్టణ అధ్యక్షుడు గంగాధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవి రావడానికి కారకులైన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ ఇరుదేశాల బంధానికి కొత్త శక్తిని ఇచ్చిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాలు భవిష్యత్తులో రెండు దేశాల ఆర్థిక, సాంకేతిక అభివృద్దికి మరింత ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు.
WGL: నర్సంపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో షీ టీమ్స్ ఎస్సై స్వాతి ఆధ్వర్యంలో శనివారం మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొనే వేధింపులు, ఫిర్యాదు చేసే విధానం, షీ టీమ్స్ సేవలను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై వివరించారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎస్సై స్వాతి తెలిపారు.
KMR: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని కారుతో అతివేగంగా దూసుకెళ్లిన నిందితుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాత నేర చరిత్ర కలిగిన ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, విద్వేషాలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడాలన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ క్రీడలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఘనంగా ప్రారంభించారు. స్వయంగా వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన ఆయన, క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు నిరంతరం నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటేనే క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని కలెక్టర్ ఆకాంక్షించారు.