తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా… గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రసంగించారు. కాగా…. గవర్నర్ ప్రసంగం పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. గవర్నర్ తో అబద్దాలు చెప్పించారని ఒకరు విమర్శించగా… గవర్నర్ తీరు పిల్లిలా మారిందని మరొకరు విమర్శించారు.
గవర్నర్ బయట పులిలా గాండ్రించి సభలో పిల్లి తీరుగా ప్రసంగం చేశారని జగ్గారెడ్డి విమర్శించారు. గవర్నర్, కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని, పెద్ద పెద్ద మాటలు చెప్పి..ప్రసంగం తుస్ అనిపించారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీకి గవర్నర్ B టీం గా మారిపోయిందని విమర్శించారు.
ఈటల మాట్లాడుతూ… బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తో అబద్దాలు చెప్పించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కువ అయ్యాయని, కరెంట్ కంటిన్యూ గా ఇవ్వడం లేదని ఒకవైపు అధికారులు అంటుంటే..మరోవైపు కరెంటు రెప్పపాటు పోకుండా ఇస్తున్నామని ప్రభుత్వం అంటోందని ఈటల విమర్శించారు.
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం సత్యదూరమైన ప్రసంగమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.గవర్నర్ ప్రసంగం… లేకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 24 గంటల విద్యుత్ పై అన్ని అబద్ధాలే చెప్పారని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రసంగం లేకుండా ఉన్నా… అబద్దాలు చదవకుండా ఉండే అవకాశం అయినా గవర్నర్ కి ఉండేదని అభిప్రాయపడ్డారు. పంట భీమా అమలు చేసినా రైతుకు లాభం అయ్యేదని, తెలంగాణ లో ఇది అమలు చేయకపోవడం తో రైతు దెబ్బతిన్నారని జీవన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగంలో డబుక్ బెడ్ రూమ్ ఊసే లేదని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. దేశంలో దళితులను ఎక్కువ మోసం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని జీవన్ రెడ్డి అన్నారు.