100 Marriages: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. ఈ వేడుక గ్రాండ్ గా జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి పెళ్లి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. గోళ్లు పెంచడం, గెడ్డం పెంచడం, బరువు పెరగడం వంటి వాటిలో విచిత్ర రికార్డులు నమోదు చేసిన వారి గురించి చదివాం. అయితే ఒక వ్యక్తి మాత్రం 100 మందికి పైగా మహిళలను పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పెళ్లిళ్ల కారణంగా ఆ వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. 100 మందికి పైగా మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తి పేరు గియోవన్నీ విగ్లియోటో. అయితే ఇది అతని అసలు పేరు కాదని పోస్టులో పేర్కొన్నారు. అతను తన చివరి భార్యను చేసుకునే సమయంలో అదే పేరు ఉపయోగించాడు. ఈ వ్యక్తి ఏప్రిల్ 3, 1929 న ఇటలీలోని సిసిలీలో జన్మించాడు. ఆ సమయంలో అతను తన పేరు నికోలాయ్ పెరుస్కోవ్ అని పెట్టాడు. కానీ ఒక ప్రాసిక్యూటర్ తరువాత అతని అసలు పేరు ఫ్రెడ్ జిప్ అని మరియు అతను ఏప్రిల్ 3, 1939 న న్యూయార్క్‌లో జన్మించాడని పేర్కొన్నాడు. 53 సంవత్సరాల వయస్సులో ఈ వ్యక్తి 100 కంటే ఎక్కువ వివాహాలు చేసుకున్నట్లు తెలిపాడు.
ఈ వ్యక్తి 1949 మరియు 1981 మధ్య ఈ మహిళలను వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరికీ విడాకులు ఇవ్వలేదు. తద్వారా అత్యధిక వివాహాల రికార్డు అతని పేరిట ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ స్త్రీలలో ఎవరికీ ఒకరికొకరు తెలియదు. అంతేకాదు ఆ మహిళలకు విగ్లియోటో గురించి పెద్దగా తెలియదు. ఈ వ్యక్తి అమెరికాలోని 14 దేశాలు, 27 వేర్వేరు రాష్ట్రాల్లోని వివిధ మహిళలను వివాహం చేసుకున్నాడు. సదరు మహిళలకు నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చి మోసం చేసేవాడు.
విగ్లియోటో ఈ మహిళలను మొదట ఫ్లీ మార్కెట్లో కలుసుకునేవాడు. అతను మొదటి సమావేశంలోనే ఈ మహిళలను వివాహం చేసుకుంటానని ప్రపోజ్ చేసేవాడు. తర్వాత వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను తీసుకుని పారిపోయేవాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్సైట్ ప్రకారం, విగ్లియోట్టో తన ఇల్లు చాలా దూరంగా ఉందని, కాబట్టి వారు తమ వస్తువులన్నింటినీ తన వద్దకు తీసుకురావాలని తరచుగా మహిళలకు చెప్పేవాడు. దీని తర్వాత అతను మహిళల ఇళ్ల సామాన్లతో ట్రక్కుతో పరారయ్యే వాడు. ఆ తర్వాత అతడు మళ్లీ కనిపించేవాడు కాదు. ఆ తర్వాత ఆ వస్తువులను ఫ్లీ మార్కెట్లో విక్రయించి మరో మహిళను ఉచ్చులోకి దించేందుకు ప్రయత్నించేవాడు. అతనిపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి.
కానీ చివరి బాధితురాలు అయిన మహిళ అతన్ని ఫ్లోరిడాలో పట్టుకుంది. షారన్ క్లార్క్ అనే మహిళ ఇండియానాలోని ఫ్లీ మార్కెట్లో పనిచేసేది. విగ్లియోటో 28 డిసెంబర్ 1981న పట్టుబడ్డాడు. దీని తరువాత జనవరి 1983లో అతనిపై విచారణ జరిగింది. దీనిలో అతనికి 34 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఇది కాకుండా, 336,000 డాలర్ల జరిమానా కూడా విధించబడింది. అతను తన జీవితంలో చివరి 8 సంవత్సరాలు అరిజోనాలోని జైలులో గడిపాడు. అతను 1991 లో 61 సంవత్సరాల వయస్సులో మెదడు రక్తస్రావంతో మరణించాడు.