మునుగోడు ఉపఎన్నిక(Munugode Election) ముగిసింది. ఎక్కడైనా పోలింగ్ దాదాపు సాయంత్రం 5 తర్వాత ముగుస్తుంది. కానీ… మునుగోడులో రాత్రి పది గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం కూడా చాలా ఎక్కువగా నమోదు కావడం విశేషం. దాదాపు 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.
పోలింగ్ ముగిసిన తరువాత సర్వే సంస్థలు తమ ముందస్తు సర్వే (Exit Poll survey)ఫలితాలను విడుదల చేశాయి. మునుగోడులో మెజారిటీ సర్వే సంస్థలు టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అంచనాలు వేశాయి. అధికార పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధిస్తాయని అంచనాలు వేశాయి. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీలు నిలుస్తాయని అంచనా వేశాయి.
ఆత్మసాక్షి సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 41 నుంచి 42 శాతం, బీజేపీకి 35 నుంచి 37 శాతం, కాంగ్రెస్ పార్టీకి 16 నుంచి 17 శాతం మేర ఓటింగ్ వస్తుందని తెలియజేయగా, పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 44.4 శాతం, బీజేపీకి 37.3 శాతం, కాంగ్రెస్కు 12.5 శాతం వస్తుందని, త్రిశూల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 47 శాతం, బీజేపీ 31 శాతం, కాంగ్రెస్ 18 శాతం ఓటింగ్ వస్తుందని తెలియజేసింది.
ఇక థర్డ్ విజన్ సంస్థ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 48 నుంచి 51 శాతం, బీజేపీకి 31 నుంచి 35 శాతం, కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15 శాతం మేర ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నది. అయితే, కౌటిల్య సంస్థ సర్వే వీటికి భిన్నంగా మునుగోడులో కాషాయం జెండా ఎగురుతుందని తెలియజేసింది. మరి గెలుపెవరిది అన్నది తెలియాలంటే నవంబర్ 6 వరకు ఆగాల్సిందే.