ఉత్తర భారతంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దీంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లుతోంది. కార్లు, టూ వీలర్లు నీట మునిగి కొట్టుకుపోతున్నాయి. భారీ భవనాలు కూడా నేలకూలుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వర్షాలు వల్ల 37 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఢిల్లీ(Delhi)లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. దేశ రాజధానిలో ఎప్పుడు లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజధాని అతలాకుతలం అవుతోంది. ఆదివారం సాయంత్రం 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటిన యమునా నది ఈ ఉదయం 206.24 కు చేరుకుంది. దీంతో హర్యానా (Haryana) హత్నికుండ్ బ్యారేజీ నుండి నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేసింది. దీంతో ఊహించిన దానికంటే ముందే నది హెచ్చరిక మార్కును దాటిందని అధికారులు వెల్లడించారు. దాంతో ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించి, యమునా (Yamuna river) పరీవాహక ప్రాంతాల్లో నివసించే వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది.
ఢిల్లీ వద్ద సోమవారం సాయంత్రానికి యమునా నది 205.33 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ మహోగ్రంగా ప్రవహిస్తోంది. అటు, హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh), ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ వర్షబీభత్సం నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఉత్తరాఖండ్ (Uttarakhand) లో వరద ఉద్ధృతికి మరో నలుగురు మరణించారు. మొత్తమ్మీద ఉత్తరాదిన ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల ప్రభావంతో మరణించినవారి సంఖ్య 43కి పెరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం (weather) కారణంగా చందేర్ తాల్ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల (School) నుంచి 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో వారిని కురుక్షేత్ర ప్రాంతానికి తరలించారు.