»Uttar Pradesh Grandma Going To School At The Age Of 92
Uttar Pradesh: 92 ఏళ్ల వయసులో స్కూల్‌కి వెళ్తోన్న బామ్మ!
ఓ 92 ఏళ్ల బామ్మ చదువుకోవాలనే ఆశతో స్కూలుకు వెళ్తోంది. ఆమెను చూసి స్ఫూర్తి పొందిన మరో 25 మంది మహిళలు కూడా పాఠశాల బాట పట్టారు. ప్రస్తుతం ఆ బామ్మకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని ఓ బామ్మ నిరూపించింది. ఇప్పటికే చాలా మంది వయసుతో సంబంధం లేకుండా విద్యనభ్యసించి సక్సెస్ అయ్యారు. అటువంటి వారి జాబితాలోకి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని బులంద్‌షహర్‌కు చెందిన 92 ఏళ్ల బామ్మ సలీమా ఖాన్ నిలిచింది. 92 ఏళ్ల వయసులో ఈ బామ్మ స్కూల్‌కు వెళ్తోంది. ఆమెను చూసి మరికొంత మహిళలు కూడా స్ఫూర్తి పొంది బడిబాట పట్టారు.
సలీమా ఖాన్ 1931లో జన్మించగా ఆమెకు 14 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. అయితే చదువుకోవాలని ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల ఆమె ఆ పనిని చేయలేకపోయింది. అప్పట్లో తమ గ్రామంలో స్కూలు లేదు. దీంతో గత ఆరు నెలలుగా ఆమె బడికి వెళ్తోంది.
స్థానిక విద్యాధికారి లక్ష్మీ పాండే ఆ బామ్మను ప్రశంసించారు. సలీమా ఖాన్ కథ అందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తుందని తెలిపారు. జ్ఞానాన్ని సంపాదించేందుకు వయసుతో పనిలేదని ఆమె మరోసారి రుజువు చేసిందన్నారు. ఆమె బడికి వెళ్లడంతో ఆమెను స్ఫూర్తి పొందిన మరో 25 మంది మహిళలు కూడా విద్యను అభ్యసించేందుకు వస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.