కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసుకుందుకు విశ్వప్రయత్నాలే చేస్తోంది. దీనిలో భాగంగా వారు విభిన్న శైలిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మూస పద్దతిలో అన్ని పార్టీల మాదిరి కాకుండా… ప్రజలను ఆకర్షించడానికి ముందు… సెలబ్రెటీలను ఆకర్షించే పని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల ఎన్టీఆర్, నితిన్ లను కలవగా,… ప్రభాస్ ని కూడా కలవనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ లోగా.. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ని అమిత్ షా స్వయంగా కలవడం రాజకీయాల్లో ఆసక్తి పెంచింది.
తాజగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తో భేటీ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సికింద్రాబాద్ వచ్చిన అమిత్ షా సభ తర్వాత పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో భేటీ అయ్యారు. దీంతో బీజేపీ వ్యూహంపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ముందస్తు షెడ్యూల్ లేకుండానే అమిత్ షా.. గోపీచంద్ తో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. దీంతో త్వరలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్ బీజేపీలో చేరుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు పుల్లెల గోపీచంద్. ఇరువురు మర్యాదపూర్వకంగానే కలిశామని, రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. కేవలం స్పోర్ట్స్ అండ్ పతకాల గురించే మాట్లాడుకున్నామని చెప్పారు. క్రీడల్లో పురోగతి, అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధానాలపై చర్చించామన్నారు. కాగా హైదరాబాద్ లో పుల్లెల గోపీచంద్ ని కలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు కేంద్రమంత్రి అమిత్ షా.