Kiren Rijiju : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. జమ్మూకశ్మీర్లో ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటన జమ్మూలోని బనిహాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తన బుల్లెట్ ప్రూఫ్ కారులో కిరణ్ రిజిజు శ్రీనగర్ వెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి సురక్షితంగా బయపట్టడారు. అయితే కారుకు కొంత నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో కిరణ్ రిజిజుతో సహా ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అంతకుముందు.. మంత్రి జమ్మూ నుండి ఉధంపూర్ వరకు న్యాయ సేవల శిబిరానికి హాజరవుతున్నప్పుడు “ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు” అని ట్వీట్ చేశారు. కాగా కేంద్రమంత్రి కిరణ్ రిజుజు శనివారం జమ్మూ యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాజకీయ కెరీర్ను మెరుగుపరచేందుకే ఉద్దేశపూర్వకంగా అదానీ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు బెదిరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.