»This Is The Main Cause Of Heart Diseases A Recent Study Revealed
Heart problems: గుండె వ్యాధులకు ప్రధాన కారణం ఇదేనట!
గుండెపోటు మరణాలతో పాటు హృద్రోగ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అయితే అందుకు ప్రధాన కారణం ఇదేనని రిసెర్చ్ వైద్యనిపుణులు చెబుతున్నారు. అందెంటో తెలుసుకోండి మరి.
ఇటీవల చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా మంది గుండెపోటు (Heart attack) బారిన పడి అర్దాంతరంగా కన్నుమూస్తున్నారు. అయితే గుండెపోటుకు అనేక కారణాలున్నా.. జీవనశైలిలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్య(health problems)లే ముఖ్య కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇతర రోజులతో పోలిస్తే సోమవారం రోజే తీవ్రమైన గుండెపోటు (STEMI) కేసులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.దీనిపై ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి (GB Pant Hospital) వైద్యుల బృందం చేసిన పరిశోధనలో గుండెపోటుకు ప్రధాన కారణం ఒత్తిడేనని తేలింది. తాజాగా జరిగిన ఈ పరిశోధనా ఫలితాలను ఇండియన్ హార్ట్ జర్నల్ ప్రచురించింది.
హృద్రోగ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన రోగులపై జీబీ పంత్ ఆసుపత్రి వైద్యుల బృందం అధ్యయనం చేసింది. తీవ్రమైన, స్వల్ప గుండెపోటుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన 903 మంది రోగుల ఆరోగ్య పరిస్థితిని నెల రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో వైద్యులు పరిశీలించారు. రోగులలో మొత్తం 92 శాతం మంది ఒత్తిడితో బాధపడుతున్నట్లు తేలిందని చెప్పారు. వారిలో కొంతమంది అధిక ఒత్తిడి(high pressure)తో మరికొందరు స్వల్ప స్థాయి ఒత్తిడితో బాధపడుతున్నారని తేల్చారు. మరీ ముఖ్యంగా ఒత్తిడితో బాధపడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉందని వివరించారు.
మారుతున్న జీవనశైలి వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలామంది ఒత్తిడితో బాధపడుతున్నారని, ఈ ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ మోహిత్ గుప్తా (Dr. Mohit Gupta) వెల్లడించారు. గుండె పనితీరుపై ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆయన వివరించారు. ఆసుపత్రిలో చేరిన రోగులలో ఎక్కువ మంది అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫారెక్షన్ (తీవ్రమైన గుండెపోటు)కు గురైనట్లు తెలిపారు.ఇందులో 53 శాతం సివియర్ హార్ట్ ఎటాక్‌కు గురికాగా, 38 శాతం ఓ మోస్తరు గుండెపోటుకు గురైనట్లు పేర్కొంది. ఒత్తిడికి తద్వారా హృద్రోగ సమస్యలు (Cardiovascular problems)పెరగడానికి ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం, బీపీ, ఇన్సులిన్ తగ్గడం తదితర కారణమని ప్రొఫెసర్ డాక్టర్ మోహిత్ గుప్తా వెల్లడించారు