కరోనా (Corona) తర్వాత ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న భయం హార్ట్ ఎటాక్ (Heart Attack). జీవనశైలి, కల్తీ ఆహారాలు, ఒత్తిడి కారణంగా చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దశాబ్దాల కిందటి వరకూ గుండెపోటు అంటే వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ గుండెపోటుకు గురవుతున్నారు. ఇటీవలె కాలంలో ముఖ్యంగా యువత గుండెపోటు సంబంధిత సమస్యలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
తాజాగా ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడు గుండెపోటుకు గురై మృతిచెందాడు. అత్యంత చిన్న వయసులో గుండెపోటు రావడం అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది. గుజరాత్ లోని దేవభూమి ద్వారకకు చెందిన దుష్యంత్ పిప్రోటార్ అనే 12 ఏళ్ల బాలుడు హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. ద్వారకాలోని భన్వాద్ తాలూక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి చదువుతున్నాడు.
దుష్యంత్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చిన్నవయసులోనే గుండెపోటు వచ్చే ఘటనలు రెండు శాతం పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి, కల్తీ ఆహారం, పని ఒత్తిడి కారణంగా ఈ గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.