రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das)కు అరుదైన గౌరవం దక్కింది. క్లిష్ట సమయంలో ఆయన చేసిన సేవలకు గానూ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. ఈ ఏడాది గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కు ఏ ప్లస్ ర్యాంకు లభించింది. ఏ ప్లస్ ర్యాంకు ముగ్గురికి లభించగా, ఆ ముగ్గురిలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ (Switzerland) సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, మూడో స్థానంలో వియత్నాం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎన్గుయెన్ థి హాంగ్ నిలిచారు. ఈ విషయాన్ని ఆర్బీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. శక్తికాంత దాస్ కు అరుదైన ఘనత దక్కడం పట్ల ఎంతో సంతోషిస్తున్నామని పేర్కొంది.
దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ (PMMODI) స్పందించారు. “ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు శుభాభినందనలు. భారతదేశానికి ఇవి గర్వించదగిన క్షణాలు. శక్తికాంత దాస్ కు లభించిన ఘనత ప్రపంచ వేదికపై మన ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తోంది. శక్తికాంత దాస్ అంకితభావం, దార్శనికత దేశ పురోగతి తీరును మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నాను” అంటూ వివరించారు. శక్తికాంత దాస్‌కు ఆర్థిక సంక్షోభం(Financial crisis), రాజకీయ ఒత్తిడిలో సెంట్రల్ బ్యాంకును ఏ విధంగా నడిపించవచ్చో అనే విషయం చాలా బాగా తెలుసు. కోవిడ్-19 సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్‌సెట్ క్లాజెస్ తీసుకువచ్చింది. కీలకమైన రంగాలు, ఫారెన్ ఎక్స్ఛేంజీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ (Over draft) సదుపాయం ద్వారా అవసరమైన నగదును అందించింది. మరోవైపు.. ఉక్రెయిన్ (Ukraine) నేషనల్ బ్యాంక్ కు సైతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించింది