విద్యార్థులు ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని.. అలా రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చిన్నారులకు గెలుపోటములను సమానంగా తీసుకోవడం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. విద్యార్థుల ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
‘జీవితంలో సమయపాలన అనేది చాలా కీలకం. ఇంట్లోని అమ్మను చూసి సమయ పాలన గురించి ఎంతో నేర్చుకోగలం. తల్లిదండ్రులు పిల్లలపై చదువుకోవాలనే ఒత్తిడి పెంచొద్దు. క్రికెట్లో ప్రతి బంతిని ఫోర్, సిక్స్ కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఉత్సాహపరచడం వల్ల పిల్లలు మరింత బాగా చదువుతారు. జీవితంలో షార్ట్ కట్స్ వెతకొద్దు. చీటింగ్ చేయడం కోసం వెచ్చించే సమయాన్ని మంచిమార్గం వైపు పెడితే గొప్ప విజయాలు సాధిస్తారు. మనం పడే శ్రమ ఎప్పుడైనా మేలు చేస్తుంది. దీనికి నేను హామీ ఇస్తున్నా’ అని మోదీ తెలిపారు.
పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వీక్షించారు. కాగా.. 2018 నుంచి పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయం పోగొట్టేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు.