»One Rupee Coin Stuck In Throat Of 12 Year Old Boy In Uttar Pradesh Removed After 7 Years
Coin Stuck : బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణెం.. ఏడేళ్ల తర్వాత సర్జరీ
ఏడేళ్ల క్రితం ఓ బాలుడి గొంతులో ప్రమాదవశాత్తూ రూపాయి నాణెం ఇరుక్కు పోయింది. దాన్ని ఇప్పుడు గుర్తించిన వైద్యులు సర్జరీ చేసి తీసివేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
Coin Stuck In Boy’s Throat : పిల్లలు ప్రమాదవశాత్తూ నాణేలు మింగే ఘటనలు మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే ఓ ఘటనలో ఆ విషయం ఏకంగా ఏడేళ్ల తర్వాత బయటపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని బఘౌలీలో మురళీ పూర్వ అనే గ్రామానికి చెందిన బాలుడు సరిగ్గా ఏడేళ్ల క్రితం అనుకోకుండా రూపాయి నాణాన్ని(One Rupee Coin) మింగేశాడు. దాన్ని అతడికి పన్నెండేళ్ల వయసు వచ్చాక డాక్టర్లు గుర్తించి బయటకు తీసేశారు.
ఈ నెల జూన్ 4వ తేదీన గొంతులో(Throat) నొప్పిగా ఉందని ఆ బాలుడు చెప్పాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ బాలుడికి ఎక్స్‌రే తీశారు. అందులో గొంతులో అడ్డంగా ఇరుక్కున్న రూపాయి నాణెం కనిపించింది. దీంతో ఈఎన్టీ సర్జన్ వివేక్ సింగ్ టెలిస్కోప్ సర్జరీ విధానం ద్వారా నాణాన్ని బయటకు తీశారు.
ఏడేళ్ల క్రితం బాలుడు ఈ కాయిన్ని(Coin) మింగేసినా అతడికి ఇప్పటి వరకు ఇబ్బంది కలగలేదన్నారు. అది ఆహార గొట్టంలో ఒక పక్కగా ఉండిపోయిందని అన్నారు. ఇప్పుడు అది అడ్డంగా రావడంతో ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. ఆ కాయిన్ ఇప్పటికే నల్లగా మారిందని చెప్పారు. దీని వల్ల నెలన్నర కిందట బాలుడికి కామెర్లు కూడా వచ్చాయని చెప్పారు. ఇలాంటి కేసులు చాలా రేర్‌గా ఉంటాయని వైద్యులు తెలిపారు. బాలుడిని మధ్య మధ్యలో వైద్య పరీక్షలకు తీసుకుని వస్తూ ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు వెల్లడించారు.