ఓ రైలు ఇంజిన్ బోగిలోకి ఎక్కిన రైల్వే సిబ్బంది మొబైల్‌పై ఫోకస్ చేసి..నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఆగి ఉన్న రైలు కాస్తా ముందుకు కదిలి ప్లాట్ ఫాంను ఢీకొట్టింది. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డు కాగా..ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Negligence of railway staff train ran into the mathura platform five members suspend
ఉత్తర్ ప్రదేశ్‌లో మంగళవారం అర్థరాత్రి జరిగిన మథుర రైలు ప్రమాదం గురించి సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ట్రైన్ ఆగిన తర్వాత లోకో పైలెట్ సిబ్బంది కిందకు దిగగా..ఆ క్రమంలో లైటింగ్ స్టాఫ్ ఉద్యోగి సచిన్ వీడియో కాల్ మాట్లాడుకుంటూ రైలు ఇంజిన్లోకి ప్రవేశించాడు. ఆ ఉద్యోగి వీడియో కాల్లో మాట్లాడుతూ తన వద్ద ఉన్న బ్యాగ్‌ను అజాగ్రత్తగా థొరెటల్పై ఉంచాడు. థొరెటల్పై బ్యాగ్‌ని ఉంచగానే ఆ ఒత్తిడికి రైలు కదలడం ప్రారంభించింది. ప్లాట్‌ఫారమ్ నంబర్-2ను బద్దలుకొట్టి 30 మీటర్లు పైగా దూసుకెళ్లింది. దీంతో మధుర రైల్వే స్టేషన్లో పట్టాలపైనుంచి రైలు ఫ్లాట్ పైకి వెళ్లగా అది ధ్వంసం కావడంతోపాటు ఒక మహిళ గాయపడింది. థొరెటల్ ఇంజిన్‌లో యాక్సిలరేటర్గా పనిచేస్తుంది. అది వేగాన్ని పెంచడం లేదా తగ్గించడానికి ఉపయోగిస్తారు.
అయితే ప్రయాణికులందరూ రైలు దిగిన తర్వాత ఈ ఘటన జరిగింది. లేదంటే పెద్ద ప్రమాదమే చోటుచేసుకునేది. అయితే ఈ ఘటనపై అప్రమత్తమైన ఉత్తర డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రకాష్ అగర్వాల్ విచారణకు ఆదేశించారు. విచారణలో తాళాలు తీసుకునేందుకు రైల్వే ఇంజిన్లోకి వెళ్లినట్లు సచిన్ తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని కూడా విచారణలో తేలింది. ఈ ఘటన నేపథ్యంలో సచిన్‌తో సహా ఐదుగురిని సస్పెండ్ చేశారు. ఘటనకు ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రాగా..ఇది చూసిన నెటిజన్లు ఒక ట్రైన్ సిబ్బందికి అంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.