ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా… ఆయన అంత్యక్రియలు నేడు ముగిశాయి. కాగా… ఆయన అంత్యక్రియలకు రాజకీయ నాయకులు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు.
అభిమానులు ములాయం సింగ్ యాదవ్ ను అభిమానంగా ‘నేతాజీ’ అని పిలుచుకుంటారు. నేతాజీ అంత్యక్రియలకు యూపీ వ్యాప్తంగా అభిమానులు సెఫాయికి తరలివచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా, అశ్రు నయనాలతో అభిమాన నాయకుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అభిమానుల ‘నేతాజీ అమర్ రహే’ నినాదాలతో ఆ ప్రదేశం మార్మోగింది.
సీనియర్ నాయకుడు ములాయం అంత్యక్రియలకు ఆయనకు సన్నిహితులైన పలువురు నాయకులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, మల్లిఖార్జున్ ఖర్గే, చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భఘేల్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు తదితర నేతలు ములాయం అంత్యక్రియలకు హాజరయ్యారు.