టీఆర్ఎస్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ – విజయవాడలో రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నేతల మద్దతు కోరారు. కాంగ్రెస్ లో మాత్రమే ఇటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక ఉంటుందని చెప్పారు.
ఈ క్రమంలో ఆయన టీఆర్ఎస్ కొత్త పార్టీ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. పేరు మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోతుందా అని విమర్శించారు. అనంతరం బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ – హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ హయాంలో నెలకొల్పిన వాటిని ఒకదాని తర్వాత మరొకదాన్ని అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు.కొందరిని కుబేరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రూపాయి విలువ పడిపోయిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పేర్కొన్నారు. 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయన్నారు. ఇప్పుడు ఐదోసారి.. తాను బరిలో దిగానని తెలిపారు. ఈ క్రమంలోనే ఉదయ్‌పూర్ చింతన్ బైటక్లో తీసుకున్న డిక్లరేషన్‌ను అమలు చేస్తానన్న ఖర్గే.. రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తామన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకు పార్టీలో 50 శాతం పోస్టులు యువతకు ఇస్తామని ఖర్గే వెల్లడించారు.
బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకమే లేదని విమర్శించారు. అద్వానీ, గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నడ్డాలను ఎన్నికలు జరిపే ఎన్నుకున్నారా అని ప్రశ్నించారు. నడ్డా పదవీ కాలం పొడిగించిన బీజేపీ కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక అర్హత లేదన్నారు. ఏడీఎంకేగా ఉన్న పార్టీ ఏఐడీఎంకేగా మారిందని గుర్తు చేసారు. టీఎంసీగా ఉన్న పార్టీ ఆల్ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అయిందన్నారు. ఇలా అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా పేరు మార్చుకున్నాయని వివరించారు. కానీ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వాటిలో ఎవరూ చేరలేదని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.