»If You Stay In Hostels And Pg You Have To Pay 12 Percent Gst
GST on Hostels: వారికి షాక్..హాస్టళ్లు, పీజీలో ఉంటే 12 శాతం జీఎస్టీ కట్టాల్సిందే!
పట్టణాల్లో హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాలు చేసే వారికి షాకింగ్ న్యూస్. ఇకపై హాస్టళ్లు, పీజీల్లో ఉండేవారికి జీఎస్టీ భారం పడనుంది. హాస్టల్ వసతిపై 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) బెంగళూరు బెంచ్ తీర్పునిచ్చింది.
హాస్టల్ వసతిపై 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) బెంగళూరు బెంచ్ కీలక తీర్పును ప్రకటించింది. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్, క్యాంప్ సైట్లను నివాస గృహాలుగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ ఆ తీర్పులో వివరించింది. అలాగే వాటి నిర్వాహకులు నెల నెలా వసూలు చేసుకునే మొత్తంపై జీఎస్టీ తప్పకుండా చెల్లించాలని వెల్లడించింది. దీంతో ఇకపై హాస్టళ్లలో ఉండే వారిపై మరింత భారం పడుతుంది. రోజుకు రూ.1000 అంతకంటే ఎక్కువ వసూలు చేసే హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ సముదాయాలు, క్లబ్బులు, హోటళ్లను నివాస గృహాల కేటగిరీలోకి రావని ఏఏఆర్ బెంగళూరు బెంచ్ ప్రకటించింది. అందువల్ల వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది.
శ్రీసాయి లగ్జరీయస్ స్టే ఎల్ఎల్పీ కేసులో ఈ తీర్పును కోర్టు వెల్లడించింది. రోజుకు రూ.1000 వరకు ఛార్జ్ చేసే హోటళ్లు, క్లబ్బులు, క్యాంప్ సైట్లకు 2022 జులై 17 వరకే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని ఏఏఆర్ తెలుపడం గమనార్హం. హాస్టళ్లలో ఉండే వారికి వంట, వసతి వంటివి విడివిడిగా ఉండవని, ఉమ్మడిగా సదుపాయాలు కల్పిస్తూ నెల నెలా ఛార్జ్ చేస్తారని గుర్తు చేస్తూ వాటిని నివాస గృహాలుగా గుర్తించలేమని ఏఏఆర్ వెల్లడించింది.
నోయిడాకు చెందిన వీఎస్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులోనూ ఏఏఆర్ లఖ్ నవూ బెంచ్ ఇదే తరహా తీర్పును చెప్పింది. దీంతో హాస్టళ్లపై 12 శాతం జీఎస్టీ విధించడం వల్ల విద్యార్థులపై అదనపు భారం పడుతుందని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ విచారం వ్యక్తం చేశారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ పునరాలోచించాలని ఆయన కోరారు.