మధ్యప్రదేశ్ లోని పన్నాలో దారుణం చోటు చేసుకుంది. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదని జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యాపారి తన భార్యను చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు ఇది హత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా సూసైడ్ నోట్ దొరికింది. అందులో ఆ వ్యాపారి పలు విషయాల గురించి ప్రస్తావించాడు. ఆ వ్యాపారి పేరు సంజయ్ సేత్. ఆయన భగేశ్వర్ ధామ్ బాబా భక్తుడు. గురూజీ నన్ను క్షమించండి. నాకు ఇంకో జన్మ ఉంటే మీకు మాత్రమే సేవ చేసుకునేలా మీకు శిష్యుడిగా పుడుతాను అంటూ సూసైడ్ నోట్ లో సంజయ్ రాశాడు.
తన సూసైడ్ కు ముందు ఒక వీడియోను కూడా సంజయ్ తన ఫోన్ లో రికార్డు చేశాడు. తన దగ్గర అప్పుగా డబ్బులు తీసుకున్నవాళ్లను ఉద్దేశిస్తూ మాట్లాడాడు. దయచేసి నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి. నా కూతురు పెళ్లి ఉంది. తన కోసం కనీసం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. నా కూతురు అకౌంట్ లో కొంత డబ్బు ఉంది. రూ.29 లక్షలు లాకర్ లో ఉన్నాయి. నేను, నా భార్య ఇలాంటి సమాజంలో బతకలేం. మాకు ఈ జీవితం వద్దు. మేము ఇక వెళ్లిపోతున్నాం. నా కూతురు కోసం చాలా బంగారం కొని పెట్టాను. బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. నన్ను క్షమించండి పిల్లలు.. అంటూ వీడియో రికార్డు చేసి ఆ తర్వాత తన భార్యను గన్ తో కాల్చి తను కూడా గన్ తో కాల్చుకున్నాడు సంజయ్.
ఇంట్లో రెండో ఫ్లోర్ లో ఉన్న సంజయ్ రూమ్ లో ఈ ఘటన జరిగింది. గన్ సౌండ్ వినగానే వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా సంజయ్ భార్య అప్పటికే చనిపోయింది. సంజయ్ కొన ఊపిరితో ఉండటంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.