హిమాచల్ ప్రదేశ్‌లో ట్రెండ్‌ను మారుస్తామని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించినప్పటికీ, ఆ ఆశలు నెరవేరలేదు. గుజరాత్‌ను ఏడోసారి సునాయాసంగా దక్కించుకున్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్‌లో గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత వెనుకబడింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌దే పైచేయి. 1985 నుండి ఇక్కడ ప్రతి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీ మారుతోంది. ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈసారి ఈ చారిత్రక ట్రెండ్‌ను మారుస్తామని బీజేపీ ఢంకా బజాయించింది. కానీ కమలం పార్టీ 30లోపు సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఓటమి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఆయన సొంత రాష్ట్రం.
ప్రస్తుతం ఎన్నికలు జరిగిన గుజరాత్ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రాలు కాగా, హిమాచల్ ప్రదేశ్ నడ్డా రాష్ట్రం. గుజరాత్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఇక కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. భారత్ జోడో యాత్ర చేస్తూనే, అప్పుడప్పుడు గుజరాత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ప్రచారం నిర్వహించిన గుజరాత్లో కాంగ్రెస్ దారుణ ఓటమి చవిచూడగా, ఆయన కనీసం ర్యాలీ నిర్వహించని హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గట్టెక్కింది.
హిమాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 35 సీట్లు గెలవాలి. కాంగ్రెస్ పార్టీ 39 స్థానాల్లో గెలిచింది. గత ఎన్నికల్లో 44 సీట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు 26 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ హిమాచల్‌ను దక్కించుకున్నప్పటికీ ఎమ్మెల్యే భయం పట్టుకుంది. తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్ తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యేలు ఎక్కడ అమ్ముడుపోతారనే భయం ప్రతి ఎన్నికల్లో ఉంటోంది. అంటే మళ్లీ రిసార్ట్ రాజకీయాలకు తెరలేచిందని చెప్పవచ్చు. తరలింపుకు చార్టర్డ్ ఫ్లైట్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా అవకాశం రాని గ్రూప్, విపక్షం వైపు చూస్తారనే ఆందోళన కాంగ్రెస్‌లో కనిపిస్తోంది.