Hathras Stampede : భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 121 మంది ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. జులై 2న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి భోలే బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవరికీ కనిపించలేదు. పోలీసులు ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్‌ను సైతం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో తొలిసారిగా మాట్లాడారు.
ఈనెల 2న జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఘటజనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను చాలా ఆవేదనకు గురైనట్లు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధను భర్తించే శక్తి భగవంతుడే ఇవ్వాలని అన్నారు. బాధిత కుటుంబాలు ఈ బాధ నుంచి బయట పడేందుకు భగవంతుడు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఆవిషయాన్ని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. తనకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని కమిటీ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్, హథ్రస్ జిల్లాల్లో ప్రతి మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సేవాదర్ ఆర్మీ అనే బృందం వీటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. సత్సంగ్ పేరుతో నిర్వహించే ఆ కార్యక్రమాలకు వేల మంది హాజరవుతూ ఉంటారు. అలా ఈ నెల 2న భోలే బాబా(Bhole Baba) సత్సంగ్‌లో దాదాపుగా 80 వేల మంది హాజరవుతారని భావించారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. ఆ కార్యక్రమానికి ఊహించని రీతిలో జనం హాజరయ్యారు. రెండున్నర లక్షల మంది పాల్గొన్నారు. దీంతో బాబా పాదాలను తాకాలని వారంతా ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట(Hathras Stampede) జరిగింది. ఇంత పెద్ద జన నష్టం చోటు చేసుకుంది.