»Cm Siddaramaiah Supreme Court Has Stayed Karnataka Cm
CM Siddaramaiah: కర్ణాటక సీఎంకు స్టే విధించిన సుప్రీంకోర్టు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాకు ఇటీవల కర్ణాటక హైకోర్టు రూ.10వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అలాగే, నేతలు ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మార్చి 6న సీఎం సిద్ధరామయ్య, 7న రవాణామంత్రి రామలింగారెడ్డి, 11న రణదీప్ సూర్జేవాలా, 15న మంత్రి ఎంబీ పాటిల్ కోర్టులో హాజరుకావాలని తెలిపింది.
బెలగావికి చెందిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఉడిపిలోని ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, కాంట్రాక్టు పనులు చేయగా.. బిల్లులు చెల్లించేందుకు మంత్రి ఈశ్వరప్ప కమీషన్ డిమాండ్ చేశారని మృతుడు సంతోష్ పాటిల్ ఆరోపించాడు. ఆ తర్వాత ఈశ్వరప్ప ఆరోపణలను ఖండించడంతో పాటు పరువు నష్టం కేసు పెట్టారు. కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు 2022 ఏప్రిల్లో ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై ఇంటిని ఘెరావ్ చేసేందుకు మార్చ్ నిర్వహించారు. నిరసన నేపథ్యంలో భారీగా రోడ్లను బ్లాక్ చేయాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. దీనిపై కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది.