తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాందేడ్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఈసందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కిసాన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. బహిరంగ సభ అనంతరం నాందేడ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో పార్టీ విధివిధానాలను స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే.. రెండేళ్లలోనే దేశమంతా నిరంతర వెలుగులు తీసుకొస్తామన్నారు. ప్రపంచంలోనే పెద్ద పెద్ద నగరాలు అయిన న్యూయార్క్, లండన్‌లో కరెంట్ పోయినా కూడా హైదరాబాద్‌లో కరెంట్ పోదని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను పవర్ హైల్యాండ్‌గా మార్చామన్నారు.
అదానీపై ఉన్న ప్రేమ.. దేశ ప్రజలపై లేదు
ప్రధాని మోదీకి.. అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై లేదన్నారు కేసీఆర్. పవర్ సెక్టార్ అనేది చాలా ముఖ్యమైన సెక్టార్ అని.. దాన్ని ప్రైవేట్ పరం చేయకూడదన్నారు. కేంద్రం మాత్రం అదానీ, అంబానీల వెంట తిరుగుతుందన్నారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేయడం అనేది దేశ వ్యవస్థకే పెద్ద ముప్పు అని, ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ ఛేదిస్తుందని.. వాటిపై పోరాటం చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. వాళ్లు విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే.. తాము దాన్ని జాతీయం చేస్తామని హామీ ఇచ్చారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
దేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అది కూడా ఏడాదిలోపే అన్నారు. హథ్రాస్ లాంటి ఘటనలను అందరం చూశామని.. బేటీ పడావో.. బేటీ బచావో అనేది కేవలం మాటలకే పరిమితం అయిందన్నారు. అందుకే.. మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.
మనకు అవసరానికి మించి నీళ్లు ఉన్నాయి
మన దేశంలో అసలు నీటి వనరులకు కొదవే లేదన్నారు. చాలా నీళ్లు ఉన్నాయని.. కేంద్ర జలశక్తి శాఖే ఈ లెక్కలను చెప్పిందన్నారు. మనకు అవసరానికి మించి నీళ్లు ఉన్నాయి. దేశంలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినా 20 వేల టీఎంసీల నీళ్లు మిగులుతాయి. కానీ.. ట్రిబ్యునల్స్ పేరుతో నీటి వాటాలపై ఎటూ తేల్చడం లేదు.. అంటూ నీటిని సరిగ్గా వినియోగించుకొని సింగపూర్, మలేషియా, జపాన్ లాంటి దేశాలు బాగా అభివృద్ధి చెందాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.