బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తోందని ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. తనకు ఈ వాహనం వద్దు అని చాలా సార్లు లేఖ రాశానని వివరించారు. అయినప్పటికీ అధికారులు వినడం లేదన్నారు. వాహనం వాడకుంటే తనకు నోటీసులు పంపిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇటీవల శంషాబాద్ నుంచి వస్తోండగా పురాణాపూర్ సర్కిల్ వద్ద కూడా వెహికిల్ ఆగిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలు అంటే సీఎం కేసీఆర్కు లెక్కలేదని చెప్పారు. రాజాసింగ్ చస్తే ఎంత? బతికితే ఎంత అని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన దృష్టిలో తన ప్రాణాలకు విలువలేదని ఫైరయ్యారు. థ్రెట్ లేని ఎమ్మెల్యేలకు మాత్రం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని రాజాసింగ్ గుర్తుచేశారు. తాను మాత్రం పాత వాహనంతో సరిపెట్టుకోవాలా అని అడిగారు. కొత్త వాహనం ఇవ్వాలని కోరితే.. పాత వెహికిల్ రిపేర్ చేయించి పంపించారని తెలిపారు.
రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇప్పటివరకు ఆరు సార్లు నడిరోడ్డుపై ఆగింది. అవసరం లేని వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇస్తుందని, తనకు ఇవ్వమని కోరితే మాత్రం ఇవ్వడం లేదని రాజాసింగ్ మండిపడ్డారు. తన భద్రతకు ముప్పు ఉందని మూడు నెలల క్రితమే ఆయన ఆందోళన చెందారు. ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.
ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంటే తనకు ఇలాంటి వాహనం ఇస్తారా అని రాజా సింగ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. నాలుగు నెలల కింద బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్డు మధ్యలో ఆగిపోతే రిపేర్ చేయించడానికి ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించానని తెలిపారు. రిపేర్ చేసి మళ్లీ తనకు ఇచ్చారని, కానీ పరిస్థితిలో ఏ మార్పు లేదన్నారు. నాంపల్లి కోర్టుకు వెళ్లే సమయంలో ఆగిపోయిందని తెలిపారు. చేసేదేమీ లేక గన్ మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. ఓసారి అఫ్జల్గంజ్ వద్ద బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతే సొంత వాహనంలో వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు.