»Chirag Paswan Has Made His Mark In Bihar Politics
Chirag Paswan: బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పాశ్వాన్
బీహార్‌కు చెందిన చిరాగ్ పాశ్వాన్ నరేంద్రమోడీ మనసును దోచుకున్నాడు. కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే కీలక బాధ్యతలు చేపడుతున్నాడు. ఎన్డీఏ కూటమి సమావేశంలో తనదైన శైలిలో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. జూన్ 7వ తేదీన ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Chirag Paswan: బీహార్‌కు చెందిన చిరాగ్ పాశ్వాన్ నరేంద్రమోడీ మనసును దోచుకున్నాడు. కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే కీలక బాధ్యతలు చేపడుతున్నాడు. ఎన్డీఏ కూటమి సమావేశంలో తనదైన శైలిలో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. జూన్ 7వ తేదీన ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక మంది నాయకులు నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిలో చిరాగ్ పాశ్వాన్ కూడా ఒకరు. తన ప్రసంగంలో అందరినీ కట్టి పడేశారు. మోడీ మనసును దోచుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి కృషి చేసిన మోడీకి చిరాగ్ పాశ్వాన్ అభినందనలు తెలిపారు. ఈ ఘనత మోడీకే దక్కుతుందని చెప్పారు. సంకల్ప బలమే చరిత్రలో ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయడంలో దోహదపడిందని కొనియాడారు. మూడోసారి ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ప్రధానిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. మోడీ వల్లే ప్రపంచం ముందు భారత్ దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని చిరాగ్ పాశ్వాన్ అభినందనలు కురిపించారు. ప్రసంగం చేసిన అనంతరం మోడీ దగ్గరకు వెళ్లి కరచాలనం చేసి కౌగిలించుకున్నారు. అనంతరం మోడీ కూడా.. చిరాగ్‌ను భుజంపైకి తీసుకుని తలపై ముద్దు పెట్టారు. ఈ సీన్‌తో అందరూ చప్పట్లతో అభినందించారు.
2020 నుంచి చిరాగ్ పాశ్వాన్ అనేక ఆటు పోట్లను తట్టుకుని నిలబడ్డారు. 2020లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందే తన తండ్రి రాం విలాస్ పాశ్వాన్ చనిపోవడంతో … చిరాగ్ పాశ్వాన్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి దిగారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ … కలిసి పోటీ చేయడం ఇష్టం లేక.. విడిగా పోటీకి దిగారు. నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేశారు. లోక్‌జన శక్తి పార్టీని పటిష్టపరిచేందుకు శాయశక్తులా కృషి చేశారు. చిరాగ్ పాశ్వాన్ … ఒంటరి పోరాటంలో నితీష్ కుమార్ ఇప్పట్లో బాగా దెబ్బ తిన్నారు. 2015లో 70 అసెంబ్లీ స్థానాలను గెలిచిన నితీష్ కుమార్… 2020 నాటికి 43 స్థానాలకు పడిపోయారు. అది కేవలం చిరాగ్ పాశ్వాన్ కారణంగానే జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికే తన బంధువు పశుపతి కుమార్ పరాస్ … పార్టీ నుంచి వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ తనతో పాటు నలుగురు ఎంపీలను కూడా తీసుకుపోయారు. పార్టీని బలహీన పరిచారు. దీంతో చిరాగ్ పాశ్వాన్ ఒంటరి వాడయ్యాడు.తక్కువ కాలంలోనే తిరిగి కోలుకున్నాడు. నరేంద్రమోడీకి దగ్గరయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. చివరకు 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మోడీతో జత కట్టారు. బీహార్‌లో ఐదుగురు ఎంపీలను గెలిపించుకున్నారు. లోక్‌జన శక్తి పార్టీ తరపున ఐదుగురు ఎంపీలను మోడీకి కానుకగా అందించాడు.
తాజాగా చిరాగ్ పాశ్వాన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లకు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ గతంలో ఓ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. 2011లో వచ్చిన మిలే నా మిలే హమ్ చిత్రంలో ..కంగనా రనైత్, చిరాగ్ పాశ్వాన్లు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తండ్రి రాం విలాస్ పాశ్వాన్ అడుగు జాడల్లో చిరాగ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తాజా ఎన్నికల్లో బీహార్‌లోని హాజీపూర్ నుంచి విజయం సాధించారు. ఎల్జేపీ నుంచి ఐదుగురు ఎంపీలుగా గెలుపొందారు. మరోవైపు కంగన.. బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.