భారతదేశం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day) ఈ నెలలో జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో హర్ ఘర్ తిరంగ ప్రచారం 2.0లో భాగంగా దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో జాతీయ జెండా(National Flag)ను కేంద్రం విక్రయించనుంది. పౌరులంతా తమ తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచిస్తూ భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. తపాలా శాఖ తన వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో జాతీయ జెండాలను విక్రయించనుంది.
ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1.60 లక్షల పోస్టాఫీసుల (post offices) ద్వారా జాతీయ జెండాలను ఇండియన్ పోస్ట్ విక్రయించనుంది. ఆగస్టు 13వ తేది నుంచి 15వ తేది వరకూ ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. జాతీయ జెండాలను డిపార్ట్మెంట్ ఇ-పోస్టాఫీసు సౌకర్యం ద్వారా కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఇండియా పోస్ట్ ద్వారా ఆన్లైన్లో జెండాను కొనుగోలు చేయండిలా: ముందుగా పోస్టాఫీసు వెబ్‌సైట్‌కి వెళ్లాలి. హర్ ఘర్ తిరంగ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. – అక్కడ లాగిన్ అవ్వాలి. – ప్రోడక్ట్‌ల కింద ‘జాతీయ పతాకం’పై క్లిక్ చేయాలి. అక్కడ కొనుగోలుపై క్లిక్ చేసి మొబైల్ నంబర్‌ను మళ్లీ నమోదు చేయాలి. అలాగే మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్’ ఎంపికపై క్లిక్ చేయాలి. మీకు సౌకర్యవంతమైన చెల్లింపు విధానాన్ని ఉపయోగించి రూ.25 చెల్లించాలి. త్రివర్ణ పతాకాన్ని ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు. త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయడానికి సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి రూ.25 నామమాత్రపు ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది.