వ్యాపార పరంగా బీసీసీఐ (BCCI) దూసుకుపోతోంది. వచ్చే ఐదేళ్లలో బీసీసీఐకి సుమారు రూ.8,200 కోట్ల ఆదాయం అందనుంది. ఇది కేవలం దేశంలో టీమిండియా ఆడే మ్యాచ్లకు మాత్రమేనని బీసీసీఐ వెల్లడించింది. భారత జట్టు వచ్చే ఐదేళ్లలో అంటే 2028 వరకూ సొంతగడ్డపై 88 మ్యాచ్లు ఆడేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి రూ.8,200 కోట్ల ఆదాయం అందనుంది. ఇప్పటికే మీడియా హక్కుల అమ్మకానికి బోర్డు టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది.
రాబోవు ఐదేళ్లలో టీమిండియా (Team India) 25 టెస్ట్ మ్యాచ్లు, 27 వన్డే మ్యాచ్లు, 36 టీ20 మ్యాచ్లు ఆడనున్నట్లు బీసీసీఐ (BCCI) తెలిపింది. అందులో ఆసీస్తో 21, ఇంగ్లాండ్తో 18 మ్యాచ్లు ఆడనుంది. గతంలో అంటే 2018 నుంచి 2023 వరకూ ఐదేళ్ల కాలంలో బీసీసీఐ మీడియా హక్కుల ద్వారా రూ.6,138 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఈసారి టీవీ, డిజిటల్ హక్కులను వేర్వేరుగా వేలం ప్రక్రియ ద్వారా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక వేస్తోంది.
ఈసారి జరిగిన ఐపీఎల్ (IPL) మీడియా హక్కులను రిలయన్స్ డిజిటల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అలాగే స్టార్ టీవీ కూడా హక్కులను గెలుచుకోగా వాటి ద్వారా బీసీసీఐ (BCCI)కి రూ.48,390 కోట్ల ఆదాయం సమకూరింది. ఐపీఎల్ మాదిరిగానే టీవీ, డిజిటల్ హక్కులను వేర్వేరుగా బిడ్లను బీసీసీఐ ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ నెల మొదటి వారంలో వేలం షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ ప్రక్రియకు ఆగస్టు 25వ తేదితో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది.