బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తనయుడు సాయిభగీరథ్ తోటి విద్యార్థిపై కాలేజీలో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఓ అమ్మాయిని తనను వేధించిన కారణంగానే సాయిభగీరథ్ తనను కొట్టాడని బాధిత విద్యార్థి కూడా వీడియో విడుదల చేశారు. తామిద్దరం ఇప్పుడు స్నేహితులుగా ఉంటున్నామని, అనవసరంగా దీనిని ఇష్యూ చేస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ సంఘటన రెండు నెలల క్రితం జరిగినట్లుగా కూడా చెబుతున్నారు. అయితే ఈ వీడియో వెలుగు చూడగానే దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అందుకే కొట్టాడు : బాధిత విద్యార్థి
కాలేజీలో ర్యాగింగ్, తోటి విద్యార్థులపై దాడులు చేశారంటూ సాయిభగీరథ్ చదువుతున్న మహేంద్ర యూనివర్సిటీ స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ సుఖేష్ ఫిర్యాదు చేసింది. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బహదూర్‌పల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో బండి సంజయ్ తనయుడు బీటెక్ చదువుతున్నాడు. రెండు నెలల క్రితం ఈ ఘటన జరిగితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేశారో తెలియడం లేదని, బండి సంజయ్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక కొడుకును లాగుతున్నారని బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమ్మాయిని ఏడిపించిన వ్యక్తిని కొట్టకుండా, ఏం చేస్తారో చెప్పాలని నిలదీస్తున్నారు. సాయిభగీరథ్‌పై దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కేసీఆర్ కి బండి సంజయ్ వార్నింగ్..
ఈ ఘటనపై బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ నీకు దమ్ముంటే, మొగోడివైతే నాతో రాజకీయం చెయ్ అని సవాల్ విసిరారు. నాతో చేతగాక, నన్ను తట్టుకోలేక నా కొడుకును లాగుతావా? అని ప్రశ్నించారు. నీ మనవడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నేను ఖండించిన విషయం మరిచిపోయావా అని మండిపడ్డారు. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగవద్దనే పద్ధతిని మేం పాటిస్తున్నాం. కనీసం నీకు ఆ సోయి లేదా అని దుమ్మెత్తిపోశారు. నా కొడుకు విషయంలో ఎప్పుడో జరిగిన దానిని తెరపైకి తీసుకు వచ్చి కేసు పెట్టిస్తావా? నేను తప్పు చేశానని దెబ్బలు తిన్న అబ్బాయి సైతం ఒప్పుకున్నాడు. పిల్లలు కొట్టుకుంటారు, కలిసిపోతారు.. మరి నీకేం నొప్పి ? అసలు నీకు ఎవరు ఫిర్యాదుచేశారు? నీ రాజకీయాల కోసం ఇంతలా దిగజారుతావా అంటూ మండిపడ్డారు. ఇలా కేసు పెట్టి ముగ్గురు చిన్నపిల్లల జీవితాలను నాశనం చేయాలని చూస్తావా అని నిలదీశారు.
నా కొడుకును పోలీసులకు అప్పగిస్తా..
నీ యాదాద్రి బాగోతాన్ని, నిజాం మనువడి అంత్యక్రియలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇదంతా చేస్తావా అంటూ నిప్పులు చెరిగారు. నా కొడుకు చేసిన తప్పేమిటి, పిల్లలపై కేసులు పెట్టిస్తారా, కేసీఆర్ నువ్వు మనిషివి కాదు.. నీ పాపం పండింది.. నా కొడుకును పోలీస్ స్టేషన్లో నేనే సరెండర్ చేస్తా, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తావా? లాఠీలతో కొట్టిస్తావా? చూద్దాం అన్నారు. తాగి పడుకోక, నీకెందుకయ్యా ఈ పిల్లలతో రాజకీయం అన్నారు. పిల్లలతో నేను చేసిన రాజకీయం సరైనదేనా ఇంటికి వెళ్లి నీ భార్యను, నీ కోడలును అడుగు అని సూచించారు.
పిల్లలను రాజకీయాలకు వాడుకోకు..
నీ కొడుకులా.. నా కొడుకు ఎప్పుడు బార్లకు వెళ్లి గొడవలు చేయలేదు. అధికార బలం చూపించి గొడవ చేయలేదు. తెల్లవారే మున్సిపల్ సిబ్బందిని పంపించి ఆ బార్‌ను సీజ్ చేయమని చెప్పలేదు. నా కొడుకు ఎప్పుడూ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి భద్రాచలం వెళ్లి తలంబ్రాలు మోయలేదు. స్కూల్లో అమ్మాయిలను తీసుకెళ్లి నా కొడుకు పార్టీలు, డ్యాన్సులు చేయించలేదంటూ బండి సంజయ్.. పరోక్షంగా కేటీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అన్ని లెక్కలు తీయమంటావా.. కానీ మాకు మానవత్వం అడ్డు వస్తోంది.. చిన్న పిల్లలు కదా.. రాజకీయాలకు వాడుకోవద్దని నేనే చెప్పాను అన్నారు.