ఈ రోజుల్లో యువత కాస్త అప్ డేటెడ్ గా ఉంటున్నారు. ఫోటోల కోసమో, వీడియో కోసమో.. మండపంలోనే వధువుకి ముద్దు పెట్టేస్తున్నారు. ఓ యువకుడు కూడా అదే చేశాడు. మెడలో వరమాల వేసి.. వధువుకి ముద్దు పెట్టాడు. అయితే… వరుడు నుంచి అది ఊహించని వధువు.. కోపంతో ఊగిపోయింది. తన అనుమతి లేకుండా ముద్దు పెట్టాడనే కారణంతో… ఏకంగా పెళ్లి రద్దు చేసేందుకు సిద్ధపడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, బదౌన్ జిల్లా బిల్సీకి చెందిన యువకుడితో సామూహిక వివాహ పథకం కింద నవంబర్ 26న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల అంగీకారం మేరకు మంగళవారం వరుడు అతడి కుటుంబ సభ్యులతో పాటు వధువు గ్రామానికి చేరుకున్నాడు.
పెళ్లి ఆచారాల్లో భాగంగా వధువు మెడలో మాల వేస్తున్న సమయంలో వరుడు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ యువతి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. వరుడి చర్యలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విషయం సద్దుమణిగింది. ఇదిలావుండగా వరుడు మళ్లీ అసభ్యకర పనులు చేయడం ప్రారంభించాడు.
దీంతో వివాహ వేడుకను నిర్వహించేందుకు పెళ్లి కూతురు నిరాకరించింది. ఇక ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు చేరింది.పోలీసులు ఈ వివాదానికి పరిష్కారం చూపించినా.. వధువు మాత్రం పెళ్లికి నిరాకరించడం గమనార్హం.