తెలిసిన వ్యక్తి నుంచి వీడియో కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. బంధువు చికిత్స మేరకు 40 వేలు అప్పుగా అడగడంతో బాధితుడు అన్లైన్లో పంపాడు. తీరా చూస్తే అది ఫ్రాడ్ కాల్, ఏఐ టెక్నాలజీతో మోసం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
Big fraud with AI technology.. Instantly Rs. 40 thousand lost
AI technology: ఈ మధ్య వచ్చిన కొత్త టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత ప్రమాదకరమైనదో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది. ఈ సాంకేతికత అనేది క్రమంగా మన జీవన విధానంలో భాగమైపోతోంది. కొందరు ఏఐ టెక్నాలజీతో కెరీర్‌కు బాటలు వేసుకుంటుంటే, మరికొందరేమో మోసాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ సాయంతో దొంగతనాల బాటపట్టారు. అందుకు ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తాజాగా ఏఐతో ముఖం మార్చుకున్న ఓ సైబర్ నేరగాడు కేరళలోని ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన రాధాకృష్ణన్ కు ఓ ప్రైవేటు నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఫోన్ లిప్ట్ చేయగా ఆంధ్రప్రదేశ్‌లోని అతని మాజీ సహోద్యోగి ముఖం కనిపించింది. కొలీగ్ కావడంతో ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఇలా మాటల మధ్యలో ఆసుపత్రిలో తన బంధువు ఒకరు చికిత్స పొందుతున్నారని, తనకు రూ.40 వేలు అవసరమని ఎలాగైన ఈ ఒక్క సాయం చేయమని కోరారు. స్నేహితుడికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో రాధాకృష్ణన్ ఆ మొత్తాన్ని ఆన్లైన్లో పంపాడు. కొద్దిసేపటి తర్వాత అదే వ్యక్తి మరో రూ.35 వేలు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన రాధా కృష్ణన్ క్రాస్ చెక్ చేయడానికి అసలైన వ్యక్తికి ఫోన్ చేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి లావాదేవీ జరిగినట్లు గుర్తించారు. ఇక విషయాన్ని బ్యాంక్ అధికారులకు వివరించి ఆ ఖాతాను నిలిపివేశారు. ఈ ఘటన సందర్భంగా సైబర్ నేరాలు ఏ రేంజ్ కు పెరిగాయో వివరిస్తూ.. కేరళ పోలీసులు ఫోన్ చేస్తే అది అసలైందో కాదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవల్సిందిగా సూచించారు. ఎవరైనా ఇటువంటి మోసాలకు పాల్పడితే హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా పోలీసులను సంప్రదించాలని కోరారు.