కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేసు నమోదు అయ్యింది. రాహుల్ తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. ఇంతకీ రాహుల్ పై కేసు నమోదు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా..? కేజీఎఫ్ సినిమా మ్యూజిక్ వాడటం. అసలు మ్యాటరేంటంటే… రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. యాత్ర ప్రచార వీడియోల్లో తమ అనుమతి లేకుండా కేజీఎఫ్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ వినియోగించుకున్నారని ఆరోపిస్తూ బెంగుళూరుకు చెందిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ కంప్లైంట్ చేసింది.
మ్యూజిక్ కి సంబంధించిన విషయంలో కాపీ రైట్ కు పాల్పడ్డారని ఎంఆర్టీ సంస్థ చేసిన ఫిర్యాదు చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాటే, రాహుల్ గాంధీలపై బెంగుళూరు సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 200, కాపీరైట్ చట్టం, 1957లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ వివాదంపై ఎంఆర్టీ సంస్థ స్పందిస్తూ హిందీ, కన్నడ, తమిళం, తెలుగు మొదలైన భాషల్లో 20 వేల కంటే ఎక్కువ పాటల మ్యూజిక్ రైట్స్ ని కలిగి ఉందామంది.
పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి మ్యూజిక్ హక్కులను కొనుగోలు చేశామని వెల్లడించింది. మా మ్యూజిక్ ని పార్టీ ప్రచారాల కోసం వినియోగించడం చట్ట విరుద్ధమని ఎంఆర్టీ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది.