అయోధ్యలో రామ మందిర నిర్మాణం చాలా మంది కల. దీని కోసం కొన్ని సంవత్సరాల పాటు… చిన్నపాటి యుద్ధాలే జరిగాయి. సుప్రీం కోర్టు తీర్పుతో… సమస్య కొలిక్కి రాగా… మందిరం ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తూనే ఉన్నారు. కాగా…వారంతా ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే మన ముందుకు రానుంది. రామ మందిరం ప్రారంభించే తేదీని… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.
త్రిపుర శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, రామాలయం ప్రారంభోత్సవం 2024 జనవరి 1న జరుగుతుందని చెప్పారు.
వచ్చే ఏడాది జనవరి 1న రామ మందిరాన్ని ప్రారంభిస్తామని ఆయన గురువారం ప్రకటించారు. అంటే సరిగ్గా ఏడాదిలోపే అయోధ్యలో శ్రీరాముడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడన్న మాట. త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో నిర్వహించిన ఓ సభలో ప్రసంగించిన అమిత్ షా ఈ ప్రకటన చేశారు. రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్, సీపీఐ(ఎం) అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. అయోధ్య అంశాన్ని కోర్టు పరిధిలో సుదీర్ఘ కాలం ఉండేలా చేశాయన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో.. ప్రధాని మోదీ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారని అమిత్ షా గుర్తు చేశారు. ‘‘రాహుల్ బాబా విను.. 2024 జనవరి 1 నాటికి అయోధ్యలోని రామ మందిరం సిద్ధం అవుతుంది’’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి హోం మంత్రి వ్యాఖ్యానించారు.