»A Shock To The Common Man Garlic Has Reached Rs 400 Per Kg
Garlic: సామాన్యులకు షాక్.. కిలో రూ.400కు చేరిన వెల్లుల్లి!
మొన్నటి వరకూ ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. అయితే ఇప్పుడు ఉల్లి పోయి వెల్లుల్లి ఆ దారిలోకి వచ్చింది. ప్రస్తుతం వెల్లుల్లి ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ తరుణంలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. తాజాగా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. అయితే ఈసారి ఉల్లి కాకుండా వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. మార్కెట్లో ప్రస్తుతం వెల్లుల్లి ధరలు కొండెక్కడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్లో ప్రస్తుతం వెల్లుల్లి ధర రూ.400లు పలుకుతుండటంతో సామాన్యులు పెదవి విరుస్తున్నారు. వంటల్లో నిత్యం వాడే ఈ వెల్లుల్లి ధర అమాంతం పెరగడంతో కొందరు వాటిని కొనడానికి ఆలోచిస్తున్నారు. మరికొందరైతే ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందేమోనని ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు వెల్లుల్లి పంటలు నీట మునగడంతో మార్కెట్లో భారీగా నిల్వలు తగ్గిపోయాయి.
సరైన నిల్వలు లేకపోవడంతో వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారు. మరొ కొత్త పంట మార్కెట్లోకి వచ్చేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఉల్లి, వెల్లుల్లి పంటలు ఎక్కువగా మహారాష్ట్ర లోని నాసిక్, పూణే ప్రాంతాల్లో పండిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రాంతాలనే ఈసారి వర్షాలు ముంచెత్తాయి. దీంతో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిళ్లింది. ఉల్లి, వెల్లుల్లి దిగుబడి భారీగా పడిపోవడంతో వ్యాపారులు ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వెల్లుల్లిని దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. మరో మూడు నెలల వరకూ వెల్లుల్లి ధరలు పెరుగుతాయే తప్పా తగ్గవని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.