రోజురోజుకి దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది. ఉద్యోగాలు లేక చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. దేశంలో ఎక్కువగా ఈ రాష్ట్రాల్లోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు ఇటీవల కేంద్రం ఓ నివేదికలో వెల్లడించింది.
Unemployment deaths: దేశంలో రోజురోజుకి పెరుగుతున్న నిరుద్యోగం యువతకు శాపంగా మారుతుంది. రోజుకి సగటున దేశంలో 10 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుందని కేంద్రం తెలిపింది. 2020-22 మధ్యలో దేశవ్యాప్తంగా 10,259 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించింది. దేశంలో నమోదైన ఆత్మహత్యల్లో 20శాతం మహారాష్ట్రలోనే జరుగుతున్నాయి. ప్రతి అయిదు ఆత్మహత్యల్లో ఒకటి ఇక్కడే నమోదవుతుంది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ ఉన్నాయి.
గతంలో కంటే ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు తగ్గాయి. మూడేళ్లలో ఇక్కడ 60 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ 20వ స్థానంలో ఉంది. అతి తక్కువగా మణిపూర్‌లో మరణాలు నమోదవుతున్నాయి. అలాగే బీహార్‌లో కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు తక్కువగానే ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదు. అండమాన్, నికోబార్ దీవులతో పాటు లడఖ్‌లో ఒక్కరు ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలో 698 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్రం ఓ నివేదికలో వెల్లడించింది.