టాలీవుడ్లో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నేటి ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ మరణించడంతో చిత్ర పరిశ్రమకు షాక్ తగిలినట్లయ్యింది. ఇదిలా ఉండగా ఈ రోజు మధ్యాహ్నం నిర్మాత యక్కలి రవీంద్ర బాబు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు కుటుంబీకులు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
55 ఏళ్ల రవీంద్ర బాబు శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతలలో ఒకరుగా ఉన్నారు. ఆయన సొంతఊరు, గంగపుత్రులు వంటి అవార్డు విన్నింగ్ సినిమాలను రూపొందించారు. అంతేకాకుండా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. యక్కలి రవీంద్ర బాబు సొంత గ్రామం మార్కాపురం. ఆయనకు భార్య రమాదేవి, కూతురు ఆశ్రీత, కుమారుడు సాయి ప్రభాస్‌లు ఉన్నారు.
మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన రవీద్ర బాబు కొంత కాలం ఛార్టర్డ్ ఇంజనీర్‌గా పనిచేశారు. సినిమాలపై ఇష్టంతో ఆయన చిత్ర సీమలోకి నిర్మాతగా అడుగుపెట్టారు. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో ఆయన దాదాపు 17 సినిమాలను నిర్మించారు. హనీ ట్రాప్, సంస్కార కాలనీ, మా నాన్న నక్సలైట్ లాంటి సినిమాలకు ఆయన సాహిత్యాన్ని కూడా అందించారు.