సినిమా లవర్స్ అంటే తెలుగు వాళ్ల తర్వాతే ఎవ్వరైనా.. అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తునే ఉన్నారు. సినిమా బాగుంటే చాలు.. హీరో ఎవరు? అనే విషయాన్నే మరిచిపోతారు. అందుకే తెలుగు వాళ్లంటేనే సీని ప్రేమికులని అంటారు. అందుకు నిదర్శనమే ఈ కొత్త సినిమాలు అని చెప్పొచ్చు.
ఓ తమిళ్ హీరోకి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. ఓ తెలుగు హీరోకి తమిళ్లో లేదనే చెప్పాలి. ఇప్పుడంటే మనోళ్లు పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్నారు కానీ.. అంతకు ముందు పరిస్థితులు వేరే. అసలు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు తెలుగు వారంటే కాదని అనలేరు మనోళ్లు. వీళ్లే కాదు సూర్య, కార్తి, విక్రమ్, విజయ్, సిద్దార్త్ లాంటి హీరోలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అలాగే మణిరత్నం, శంకర్ లాంటి డైరెక్టర్లు ఎప్పుడో మనోళ్లు అయిపోయారు. వీళ్ల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. తెలుగు సినిమాలను సైతం పక్కకు పెట్టేస్తారు. వీళ్లే అని కాదు.. కంటెంట్ బలంగా ఉంటే చాలు.. తెలుగు జనాలు థియేటర్లకు క్యూ కట్టేస్తారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కెజియఫ్, కాంతార, 777 ఛార్లీ, విక్రమ్ లాంటి సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు జనాలు. ఇక రీసెంట్గా వచ్చిన జైలర్ సినిమాకు భారీ వసూళ్లను ఇచ్చేశారు. ఇక ఇప్పుడు జవాన్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఉన్నా కూడా జవాన్ కోసం థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇలా పరభాష సినిమాల పై కాసుల వర్షం కురిపిస్తున్నారు తెలుగు ఆడియెన్స్. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి ఆ సినిమాలు.
ఇక వచ్చే నెలలో విజయ్ ‘లియో’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. దసరాకు బాలయ్య ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ లాంటి సినిమాలు పోటీ పడుతున్నా.. లియో గట్టి పోటీ ఇవ్వనుంది. ఎందుకంటే.. కేవలం ఈ సినిమా తెలుగు బిజినెస్ 21 కోట్లకు పైగా జరిగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రానున్న ఇండియన్ 2 పై కూడా భారీ అంచనాలున్నాయి. ఇలా అయితే రాబోయే రోజుల్లో డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. కానీ తెలుగు సినిమాల పరిస్థితి అలా లేదు. పాన్ ఇండియా హీరో అయితే తప్పా.. పర భాషల్లో రీజనల్ సినిమాలు రాణించడం లేదు. అయినా కూడా.. తెలుగు జనాలకు సినిమా నచ్చితే వదిలిపెట్టరు.