హిట్స్, ఫట్స్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ మధ్య కాలంలో రవితేజ చేస్తున్న సినిమాలన్నీ ఒక్క ఏరియాతోనే ముడిపడుతున్నాయి. తాజాగా అనౌన్స్ అయినా మాస్ క్రాక్ కాంబో కూడా అలాంటి బ్యాక్ డ్రాప్లోనే రాబోతుండడం విశేషం.
Ravi Teja: డాన్ శ్రీను, బలుపు, క్రాక్ సినిమాలతో ఊర మాస్ కాంబినేషన్ అనిపించుకున్నారు మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరూ కలిస్తే మినిమం గ్యారెంటీ సినిమా వస్తుందని.. గత మూడు సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇక క్రాక్ సినిమా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడదే మాస్ హిస్టీరియాని మరోసారి క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రవితేజ-గోపీచంద్ మలినేని. పోయిన సంక్రాంతికి వీరసింహారెడ్డితో దుమ్ములేపన మలినేని.. మరోసారి మైత్రీ మూవీ మేకర్స్‌తో, రవితేజతో నాలుగోసారి భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు.
RT4GM అనే వర్కింగ్ టైటిల్‌తో త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ ఒక సాలిడ్ పోస్టర్ని రిలీజ్ చేసారు. అందులో విలేజ్ బ్యాక్ డ్రాప్, టెంపుల్ సెటప్, ఉరి వేయబడిన మనిషి ఉన్నారు. ఆ పోస్టర్లో ‘చుండూరు’ అనే ఊరి పేరు కూడా ఉంది. దీంతో ‘చుండూరు’ మారణహోమం కథతో ఈ సినిమా చేస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశాన్ని కుదిపేసింది చుండూరు మారణహోమం.
1991లో 22 దళితుల మృతికి కారణమైన ఈ మారణహోమం కథతో రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నారా? లేక ఆ ఊరి పేరును మాత్రమే తీసుకున్నారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చుండూరు బ్యాక్ డ్రాప్ అనే సరికి రవితేజ సినిమాలన్నీ చీరాల బ్యాక్ డ్రాప్లో వస్తున్నాయని చెప్పొచ్చు. ఇంతకు ముందు గోపీచంద్, రవితేజ కాంబినేషన్లో వచ్చి, బ్లాక్‌బస్టర్ కొట్టిన ‘క్రాక్’ సినిమా కూడా చీరాల సమీపంలో గల ఒంగోలు, వేటపాలెం నేపథ్యంలో సాగింది. ఇక ఇప్పుడు చుండూరు నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. దసరాకు రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా చీరాల సమీపంలో గల ‘స్టూవర్టుపురం’ నేపథ్యంలో తెరకెక్కుతోంది. దీంతో రవితేజ సినిమాలు అన్నీ చీరాల చుట్టే తిరుగుతున్నాయని చెప్పొచ్చు.