తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల ఒక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ మూవీలో అక్కినేని నాగార్జున ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
నాగార్జున గతంలో కార్తీతో కలిసి ఊపిరి చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో తమిళ హీరో ధనుష్‌తో జోడీ కట్టబోతున్నాడు. నాగార్జున ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపించినట్లు సమాచారం. “సార్” సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్ట్రెయిట్ సినిమాతో తెలుగులో మరింత క్రేజ్ సంపాదించుకోవడం ఖాయమనే కామెంట్స్ వినపడుతున్నాయి. కాగా ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక నటించనుంది.
అంతేకాకుండా మ్యూజికల్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాగార్జున భార్య అమల అక్కినేని ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించింది. నటుడి పెద్ద కొడుకు నాగ చైతన్య కూడా శేఖర్ దర్శకత్వంలో లవ్ స్టోరీలో నటించాడు. ఇప్పుడు నాగ్ వంతు వచ్చింది. ఈ విషయంలో కొడుకు, భార్యను నాగ్ ఫాలో అవుతున్నట్లే.