జగ్గారెడ్డి కొత్తగా తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. అదే సినిమా నటుడిగా. స్వంత నిర్మాణంలో ఆయనొక సినిమాకి సారధ్యం వహించడమే అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఇదేంటి ఈ కొత్త అవతారం అనుకునేవాళ్లు లేకపోలేదు. నిజానికి చెప్పాలంటే సంగారెడ్డి నియోజకవర్గంలో ఆయన కత్తికి ఎదురేలేదు.
రాజకీయాలలో అనేక సంవత్సరాలుగా రాటుదేలి, తనదైన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి, వ్యక్తిగతమైన అస్థిత్వాన్ని ఏమాత్రం చేజార్చుకోకుండా ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు నిలదొక్కుకున్న పోరాటయోధుడు తూర్పు జగ్గారెడ్డి. తనదైన గళం వినిపించడంలో ఎవ్వరికీ ఎప్పుడూ వెరవకుండా, పర్యవసానాలు ఏమైనా సరే ఎదురొడ్డి రాజకీయపోరాటం చేయడంలో జగ్గారెడ్డి శైలి, పోకడ చాలా విభిన్నమైనది. ఈ మాటని ఎవ్వరూ విభేదించలేరు. ఎందుకంటే ఆయనని వ్యక్తిగతంగా తెలిసినవారు, పరోక్షంగా పరిశీలించినవారు కూడా ఆయన విధానానికి ఆశ్చర్యపడని సందర్భమే లేదు. ఆదీ ఆయన స్టయిల్. సినిమా పరిభాషలో చెప్పాలంటే ఆయన రూటే సెపరేటు.
ప్రప్రధమంగా బిజెపి తరుఫున కౌన్సిలర్‌గా ఎన్నికై, తర్వాత కాలంలో మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. 2004లో టిఆర్ఎస్ తరుఫున ఎమ్మేల్యేగా గెలిచి, వెనువెంటనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. 2009లో తిరిగి విజయాన్ని కైవశం చేసుకున్నారు. ఇలా అనేక మార్పుచేర్పులతో ప్రస్తుతం ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయ జీవితం గురించి చర్చ అక్కర్లేదు ఆయనొక తెరచి ఉంచిన పుస్తకం.
కానీ ఇప్పుడు జగ్గారెడ్డి కొత్తగా తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. అదే సినిమా నటుడిగా. స్వంత నిర్మాణంలో ఆయనొక సినిమాకి సారధ్యం వహించడమే అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఇదేంటి ఈ కొత్త అవతారం అనుకునేవాళ్లు లేకపోలేదు. నిజానికి చెప్పాలంటే సంగారెడ్డి నియోజకవర్గంలో ఆయన కత్తికి ఎదురేలేదు. ఓడినా, గెలిచినా ఏమాత్రం పొలిటికల్ గ్లామర్ చెడిపోని నాయకుడెవరైనా ఉన్నారంటే జగ్గారెడ్డి పేరే ఉదహరించి తీరాల్సిన జీవితం ఆయనది. ఇందులో సందేహమే లేదు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు అనుక్షణం అయన వెంటే ఉన్నారు. దీనికి బలమైన కారణంగా చెప్పాలంటే ఒక్కటే ఒక్కటి. ప్రజలకు ఏది కావాల్సిన తక్షణం అక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోయే తెగువ, చొరవ ఆయనలో నిండుగా మెండుగా ఉంటాయి. ఉన్నాయి. మరైతే ఈ గ్లామర్ ఆయన సరిపోలేదని అనుకున్నారో ఏమో తెలియదు. సినిమా గ్లామర్ కూడా ప్లస్ అయితే దాని వల్ల మైలేజ్ ఎక్కువవుతుంది. మాస్ ప్రజానీకంలో మరింతగా చొచ్చుకునిపోతానని అనుకున్నారో ఏమిటో ఆయనే చెప్పాలి. కానీ ఆయన తీసుకున్న సినిమా నిర్ణయం మాత్రం చర్చనీయాంశమే అయింది. కనుబొమ్మలు ఎగరేస్తున్నవాళ్ళూ ఉన్నారు. భలే అంటున్నవారూ ఉన్నారు.
సినిమా గ్లామర్ కొట్టేదేముంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా అనే పవర్ఫుల్ మీడియాని ఢీకొట్టగలిగేదే లేదు. అందుకే తెరంగేట్రం చేస్తున్నట్టున్నారు జగ్గారెడ్డి. ఆయనే ప్రధానపాత్రధారిగా ఓ ప్రేమజంటను కలిపే కధాంశంతో సినిమా పరిశ్రమలో అపారమైన అనుభవం ఉన్న రామానుజం అనే దర్శకుడి నిర్దేశకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా సినిమా వర్గాల్లో వినిపిస్తోంది. జగ్గారెడ్డి అనుయాయులు ఔననే అంటున్నారు. జగ్గారెడ్డి ఏంచేసినా సంచలనమే. ఏం మాట్లాడినా సంచలనమే. మరీ సినిమా కూడా అంతే అవుతుందా లేదా అనేదే ఇప్పుడు చూడాల్సింది. బెస్టాఫ్ లక్ జగ్గారెడ్డిగారు.