Srilanka : శ్రీలంక కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాల వ్యాపారంతో ఇబ్బంది పడుతోంది. అయితే ఇప్పుడు అక్కడి ప్రభుత్వం దీనిని అణిచి వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా శ్రీలంక ప్రభుత్వం గత 50 రోజులుగా యుక్తియా పేరుతో ప్రచారం నిర్వహిస్తోంది. యుక్తియా అంటే సింహళ భాషలో ‘న్యాయం’ అంటారు. ఈ ప్రచారం కింద 50,000 మందికి పైగా డ్రగ్స్ డీలర్లు, నేరస్థులను అరెస్టు చేశారు. దీంతో పాటు లక్షల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ దుర్వినియోగానికి సంబంధించి 49 వేలకు పైగా అరెస్టులు జరిగాయి. కాగా నేరస్తుల జాబితాలో 6 వేల మందికి పైగా ఉన్నారు.
యుక్తియా ప్రచారం డిసెంబర్ 17న ప్రారంభించబడింది. జూన్ 30తో ముగియడానికి గడువుగా నిర్ణయించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి శ్రీలంక పోలీసులు ప్రతిరోజూ వివరణాత్మక ప్రకటన జారీ చేస్తున్నారు. ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు పోలీసులు హాట్‌లైన్‌ను కూడా రూపొందించారు. ఈ ప్రచారం ద్వారా దేశం నుండి మాదకద్రవ్యాల వ్యాపారాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం పోరాడుతోంది. అదే సమయంలో కొన్ని వర్గాల నుండి విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. విమర్శకులు మానవ హక్కుల ఉల్లంఘన ప్రశ్నలను లేవనెత్తారు.
యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్, లోకల్ హ్యూమన్ రైట్స్ కమీషన్, లాయర్స్ కలెక్టివ్ వంటి అనేక ఇతర హక్కుల సంఘాలు ఖండించినప్పటికీ ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మాదకద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కోవడానికి శ్రీలంక ప్రభుత్వం అమానవీయ ఆపరేషన్‌ను నడుపుతోందని ఈ వర్గాలు ఆరోపించాయి. డిసెంబర్ 17 నుండి ఇప్పటివరకు అరెస్టయిన వారిలో కొందరిని చెడుగా ప్రవర్తించారు… హింసించారు.