»Pms Speech Was Impressive Indians In Austria Expresses Happiness Over Pm Modis Visit
PM Modi : భారత్ ప్రపంచానికి బౌద్ధాన్ని ఇచ్చింది.. యుద్ధాన్ని కాదు.. ఆస్ట్రియాలో మోదీ
ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ ఎప్పుడూ శాంతినే ప్రచారం చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. అక్కడ ఆయన ప్రసంగ విశేషాలు ఇలా ఉన్నాయి.
PM Modi Foreign Tour : భారత్ ఎప్పుడూ శాంతి, సామరస్యాలనే ప్రచారం చేస్తోంది తప్ప యుద్ధాలను కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రియా(Austria) పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రవాసులను ఉద్దేశించి వియన్నాలో మాట్లాడారు. భారత్(India) ప్రపంచానికి బౌద్ధాన్ని అందించిందని అన్నారు. సర్వ మానవ శాంతి, సామరస్యాలనే తమ దేశం కోరుకుంటోందని అన్నారు. 21వ శతాబ్దంలో ఆ బాధ్యత తమపై మరింత ఎక్కువగా ఉందని అన్నారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపూ ప్రవాస భారతీయులు అక్కడ చప్పట్లు, నినాదాలతో సభను హోరెత్తించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.
ఆస్ట్రియాలో ప్రసంగించిన పీఎం మోదీ(PM MODI) భారత విధివిధానాల గురించి ఎలుగెత్తి చాటారు. ఎప్పుడు భారత్ విశ్వ బంధుగానే ఉందన్నారు. వేల సంవత్సరాలుగా తమ విజ్ఞానాన్ని, నైపుణ్యాలను ప్రపంచంతో పంచుకుంటోందని తెలిపారు. యుద్ధాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. బదులుగా శాంతి స్థాపనకే కృష్టి చేస్తోందని, దాన్నే ప్రచారం చేస్తోందని అన్నారు. అందుకనే భారత్ చేసే పనులను ప్రపంచం మొత్తం క్షణ్ణంగా గమనిస్తోందంటూ చెప్పుకొచ్చారు.
భారత్‌ని మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే తమ లక్ష్యమని మోదీ అన్నారు. 2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. అలా అభివృద్ధి చెందిన దేశంగా వెయ్యేళ్ల పాటు కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. భారత్‌లానే(India) ఆస్ట్రియా చరిత్ర సైతం చాలా పురాతనమైనదని మోదీ కొనియాడారు. అలాగే రెండు దేశాల మధ్య బంధం కూడా అన్నారు. 75 ఏళ్లుగా రెండు దేశాలకు దౌత్య ఒప్పందాలు ఉన్నాయన్నారు. ఇలా బలమైన బంధం వల్ల రెండు దేశాలకూ లబ్ధి చేకూరుతుందని అన్నారు. మోదీ ప్రసంగం పట్ల అక్కడి భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగించిన తీరు ఆకట్టుకుందన్నారు. ఆ తర్వాత మోదీ తిరిగి భారత్‌కు(India) బయలుదేరారు.