Brazil Rains : ప్రస్తుతం బ్రెజిల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమై పరిస్థితి అదుపు తప్పుతోంది. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య గురువారం రాత్రికి 29కి పెరిగింది. మరో 60 మంది దాకా గల్లంతు అయ్యారు. ఈ సమాచారం రాష్ట్ర పౌర రక్షణ సంస్థ అందించింది. వర్షం కారణంగా 13 మంది మరణించారని.. 21 మంది తప్పిపోయారని ఏజెన్సీ గతంలో నివేదించింది. వరదల కారణంగా రియో గ్రాండే దో సుల్లో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. చాలా ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
వరదల తర్వాత ఇప్పుడు మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పౌర రక్షణ సంస్థ తెలిపింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గురువారం రాష్ట్రానికి వెళ్లి స్థానిక అధికారులతో సమావేశమై తన సంఘీభావం తెలిపారు. ఈ వర్షం వల్ల నష్టపోయిన ప్రజల అవసరాలను తీర్చేందుకు మా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది’ అని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో రాశారు.
వర్షం కారణంగా 10,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చిందని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ కూడా తెలిపింది. సోమవారం ప్రారంభమైన వర్షాలు శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. వరదల్లో చిక్కుకున్న ఇళ్ల నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. సివిల్ డిఫెన్స్ బులెటిన్ ప్రకారం, 154 నగరాలు ప్రకృతి వైపరీత్యాల బారిన పడ్డాయి.