కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత (Rahul Gandhi Disqualification) వ్యవహారంపై అంతర్జాతీయంగా చర్చ సాగుతోంది. రెండు రోజుల క్రితం అమెరికా (America on Rahul Gandhi Disqualification) స్పందించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ కేసును తాము గమనిస్తున్నామని చెప్పింది. తాజాగా జర్మనీ (Germany on Rahul Gandhi Disqualification) కూడా ఈ అనర్హత వేటు పైన మాట్లాడింది. రాహుల్ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని, తీర్పు పైన ఆయనకు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది. భారత్ లో ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేత రాహుల్ గాంధీకి జైలు శిక్ష పడిందని, ఆ తీర్పు నేపథ్యంలో ఆయన లోకసభ సభ్యత్వం రద్దయిందని, ఈ అంశాలను తాము గమనిస్తున్నామని జర్మనీ పేర్కొన్నది. అయితే ఈ తీర్పు పైన ఆయనకు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉన్నదని గుర్తు చేసింది. ఆయన అప్పీల్ చేసుకునే స్థితిలో ఉన్నారని, అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా… ఏ ప్రాతిపదికన అనర్హత వేటు వేశారనే విషయం స్పష్టమవుతుందన్నారు. ఈ కేసుకు కూడా న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని జర్మనీ భావిస్తోందని తెలిపింది.
ఇటీవల అమెరికా కూడా రాహుల్ లోకసభ సభ్యత్వం రద్దు పైన స్పందించింది. ఏ ప్రజాస్వామ్యానికి అయినా చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్ర మూల స్తంభాల్లాంటివి అని పేర్కొన్నది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్ తో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నది. తద్వారా అమెరికా, జర్మనీ వంటి దేశాలు రాహుల్ గాంధీని కోర్టుకు వెళ్లవచ్చునని పరోక్షంగా, ప్రత్యక్షంగా సూచిస్తున్నాయి. బీజేపీ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. చట్టబద్దంగా జరిగిన అనర్హత పైన లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ కోర్టుకు వెళ్లారని, రాహుల్ కూడా అలా వెళ్లవచ్చునని చెబుతున్నాయి.
2019లో మోడీని విమర్శించే క్రమంలో రాహుల్ గాంధీ… ఓబీసీకి చెందిన మోడీ అనే కులాన్ని మొత్తాన్ని కించపరిచారని చెబుతూ గుజరాత్ కు చెందిన ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. చట్టం ప్రకారం రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే వెంటనే చట్ట సభ సభ్యుడి పైన అనర్హత వేటు ఉంటుంది. ఈ ప్రకారమే గతంలో లాలూ ప్రసాద్, తాజాగా లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ పైన లోకసభ సచివాలయం చర్యలు తీసుకున్నది. రాహుల్ విషయంలోను అదే జరిగింది. కానీ దీనిని కాంగ్రెస్ రాద్దాంతం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రాహుల్ కు కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ దానిని ఉపయోగించుకోవడం లేదని అంటున్నారు.