మనకు ఏ మాత్రం విసుగ్గా అనిపించినా, తలనొప్పిగా అనిపించినా వెంటనే టీ తాగాలని అనిపిస్తుంది. అయితే మనం తేనీరులు పాలు, చక్కెర వేసుకుని తాగే టీ వల్ల కొన్ని దుష్ప్రభావాలూ లేకపోలేదు. అలా కాకుండా కొత్తగా నీటిలో లవంగాలు, అల్లం, దాల్చిన చెక్క చేర్చుకుని మరిగించి టీలా తాగి చూడండి. కావాలనుకుంటే కాస్త తేనె నిమ్మరసం చేర్చుకుంటే సరిపోతుంది. తాగగానే మంచి రిఫ్రెష్మెంట్తో పాటు, చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని ఇది కలిగిస్తుంది.
దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలూ ఉంటాయి. టీకి అల్లం ప్రత్యేకమైన ఫ్లేవర్‌ని ఇస్తుంది. బద్ధకాన్ని వదిలించే లక్షణమూ దీనికుంది. దీంట్లోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అలాగే లవంగాల్లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి మూడూ కలిపి చేసిన టీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా ఈ టీ ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల పరాన్నజీవులు, వైరస్లు, బ్యాక్టీరియాలు మన శరీరంపై దాడి చేయకుండా నిలువరిస్తుంది. అందుకే దీన్ని వారంలో రెండు, మూడు సార్లైనా తాగమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. లవంగాల్లో ఉండే యూజీనాల్ సహజమైన పెయిన్ కిల్లర్‌గా పని చేస్తుంది. దీని వల్ల తల నొప్పులు, కండరాల నొప్పులు లాంటివి తగ్గుతాయి. మూడు సుగంధ ద్రవ్యాల్లోనూ ఉన్న లక్షణాల వల్ల శరీరంలో అంతర్గత భాగాల్లో వచ్చే వాపులు రావు. తద్వారా వచ్చే వ్యాధులపైనా ఇది పోరాడుతుంది. ఈ టీ జీవ క్రియను మెరుగుపరుస్తుంది. శరీర బరువును నియంత్రిస్తుంది. అలాగే ఎప్పుడుబడితే అప్పుడు వచ్చే క్రేవింగ్స్‌ని తగ్గించి అతిగా తినకుండా చేస్తుంది.