Curd : పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాలను వృద్ధి చేయడంలో దీనిలోని ప్రోబయోటిక్స్ పనికి వస్తాయి. అందుకనే చాలా మంది దీన్ని భోజనంలో తప్పక భాగం చేసుకుంటారు. అయితే దీన్ని తినడం వల్ల ప్రయోజనాలు ఇంకేమిటో? ఏ సమయంలో తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందగలమో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగును(Curd) ఉదయం, రాత్రి కాకుండా మధ్యాహ్న సమయంలో తీసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నించాలి. డైటీషియన్ల సలహా ప్రకారం ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియకు మేలు జరుగుతుంది. అదే రాత్రి పూట తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జలుబు, ఎక్కువగా దగ్గు లాంటివి ఉన్నప్పుడు కూడా దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే దీనిలో శరీరానికి చలువ చేసే లక్షణం ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ, బీ6, బీ12, రిబోఫ్లావిన్లాంటివీ ఉన్నాయి. అందుకనే దీన్ని సూపర్ ఫుడ్ అని చెబుతారు.
పోషకాహార నిపుణుల సూచన ప్రకారం చూసుకున్నట్లైతే రోజుకు వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు పెరుగును(Curd) తినొచ్చు. ఇలా తినడం వల్ల మన అవసరాలకు సరిపడనంత కాల్షియం మనకు పెరుగు నుంచి లభిస్తుంది. అలాగే విటమిన్లు, ఖనిజాల్లాంటివీ ఇందులో మనకు పుష్కలంగా దొరుకుతాయి. అందువల్ల రక్తపోటు, గుండె జబ్బుల్లాంటివి రాకుండా ఉంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి పూత ఉన్నా, పేగుల్లో అల్సర్లు ఉన్నా పెరుగు తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్లను తగ్గిస్తుంది. దీంతో ఆటో ఇమ్యూన్ వ్యాధులు, మధుమేహం ఆర్థరైటిస్ లాంటివి తగ్గుముఖం పడతాయి.